శ్రీవారి దర్శనం టికెట్లతో నకిలీ వెబ్‌సైట్ మోసం!

20 Jul, 2015 03:17 IST|Sakshi
శ్రీవారి దర్శనం టికెట్లతో నకిలీ వెబ్‌సైట్ మోసం!

భక్తులకు అంటగట్టిన రూ. 300 టికెట్లు .. విచారణకు ఆదేశించిన టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి ప్రవేశ పెట్టిన రూ.300 ఆన్‌లైన్ టికెట్లలో ఆదివారం నకిలీ టికెట్లు వెలుగుచూశాయి. చెన్నైకు చెందిన మనోజ్‌జైన్ దంపతులు స్థానికంగా ‘టెంపుల్ యాత్రీ’వెబ్‌సైట్ ద్వారా రెండు రూ.300 టికెట్లు రిజర్వు చేసుకున్నారు. వాటి ద్వారా ఆదివారం తిరుమలకు వచ్చారు. క్యూలోకి ప్రవేశించారు. అక్కడ తనిఖీల్లో అవి నకిలీ టికెట్లుగా గుర్తించారు. దీంతో వారిని దర్శనానికి అనుమతించలేదు.

అక్కడే క్యూను తనిఖీ చేస్తున్న టీటీడీ ఈవో సాంబశివరావుకు బాధిత భక్తులు ఫిర్యాదు చేశారు. తాము టీటీడీ వెబ్‌సైట్ అనుకుని టికెట్లు బుక్ చేశామని వివరించారు. బాధితుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి దర్శనానికి అనుమతించారు. నకిలీ టికెట్ల ఘటనపై టీటీడీ ఈవో సాంబశివరావు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
 
టీసీఎస్ ద్వారా టీటీడీ వెబ్‌సైట్ ఆధునికీకరణ
టాటా కన్సల్టెన్సీ సాఫ్ట్‌వేర్ సంస్థ ద్వారా టీటీడీ వెబ్‌సైట్‌ను పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తున్నామని ఈవో తెలిపారు. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డితో కలసి క్యూలను సందర్శించారు. సేవా టికెట్లను ఆగస్టు 25వ తేదీ వరకు విక్రయించామన్నారు. రూ.300 టికెట్లను 21వేల నుంచి 26 వేలకు పెంచామన్నారు.

భక్తులకు సులభతరంగా శ్రీవారిదర్శనం, సేవా టికెట్లు లభించేలా మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌ను ఎవరూ హ్యాక్ చేసే అవకాశం లేదని ఈవో స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో వెబ్‌సైట్‌ను ఆధునికీకరించాక తిరిగి సేవా టికెట్ల బుకింగ్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు