బర్కిలీ కాలేజీతో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ఒప్పందం

27 Jul, 2017 03:38 IST|Sakshi

 అమరావతి: చెన్నై, అమరావతిల్లోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ.. డాడో, మారియా బనటావో ప్రపంచ విద్యా కేంద్రం ద్వారా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బర్కిలీ ఇంజనీరింగ్‌ కళాశాలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, వ్యవస్థాపక రంగంలో ఈ రెండు విద్యాసంస్థల మధ్య పరస్పరం సమాచార మార్పిడి జరగనుంది. ఇందులో భాగంగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఆవిష్కరణలు, వ్యవస్థాపక రంగంలో శిక్షణ నిచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ పి.సత్యనారాయణ్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆలోచనలు, వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక సామాజిక పద్ధతులను కలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. తద్వారా అమరావతి, చెన్నైల్లో వినూత్న ఆవిష్కరణలకు చోటిచ్చే వాతావరణాన్ని సృష్టించి తీర ప్రాంతాలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆవిష్కరణలు, నమూనాల రూపకల్పనకు సంబంధించిన కోర్సులను రూపొందించడంలో బర్కిలీ ఇంజనీరింగ్‌ కళాశాల సహకరిస్తుంది. అలా భవన నిర్మాణాన్ని పరిశీలించడానికి ఎస్‌ఆర్‌ఎం సిబ్బందిని తమ కాలేజీలోకి అనుమతించనుంది.
 

మరిన్ని వార్తలు