వెయ్యి కోట్లు కట్టాల్సిందేనా?

27 Jul, 2015 03:31 IST|Sakshi

రాష్ట్ర ఆబ్కారీకి సర్వీస్ ట్యాక్స్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ శాఖకు సర్వీస్ ట్యాక్స్ విభాగం కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి ఇప్పటి వరకు మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, బాట్లింగ్‌కు సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లించ లేదని నిర్ధారించిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ మూడు రోజుల క్రితం సెర్చ్ వారెంట్లతో రెండు రాష్ట్రాల బేవరేజెస్ కార్పొరేషన్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం సరఫరా, డిపోల నిర్వహణ చూసిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచే బకాయిలను వసూలు చేయాలని సర్వీస్ ట్యాక్స్ విభాగం భావించింది.

రెండు రాష్ట్రాలకు కలిపి సర్వీస్ ట్యాక్స్ సుమారు రూ.1,000 కోట్ల వరకు ఉన్నట్లు లెక్కలు తేలడంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎక్సైజ్ శాఖ ద్వారా సర్వీస్ ట్యాక్స్ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిర్దేశిత అంశాలు, ఇప్పటి వరకు వివిధ శాఖల్లో జరిగిన పంపకాల తీరును సర్వీస్‌టాక్స్ అధికారులకు వివరించడంతో 2010-11 నుంచి 2013-14 వరకు చెల్లించాల్సిన సర్వీస్ ట్యాక్స్‌ను రెండు రాష్ట్రాలకు పంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ మేరకు జనాభా, మద్యం డిపోల్లో నిర్దేశిత సేవల ఆధారంగా పన్నును విభజించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తదనుగుణంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల విలువను మదింపు చేసిన అధికారులు సోమవారం డిమాండ్ తుది నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎంత మొత్తంలో పన్ను చెల్లించాలో కూడా నోటీసుల్లో పేర్కొని, 30 రోజుల గడువిచ్చే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు