తెలంగాణ భవన్‌లో బోనాల పండుగ

10 Jul, 2016 04:55 IST|Sakshi
తెలంగాణ భవన్‌లో బోనాల పండుగ

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార పండుగ.. బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల పండగను ఆలయ కమిటీ సభ్యులు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శనివారం తొలి రోజు అమ్మవారి ఘట స్థాపనతో బోనాల పండగ వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు చూ సేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ భవన్ సమీపంలోని అమ్మవారి గుడి నుంచి ప్రారంభమైన ఊరేగింపు డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాల మధ్య ఉత్సాహంగా ముందుకు సాగింది.

అనంతరం తెలంగాణ భవన్‌లో అమ్మవారి ఘట స్థాపన చేశారు. ఆలయ కమిటీ సలహాదారు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ రెండో రోజు అమ్మవారికి బంగారు, వెండి బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. లాల్‌దర్వాజ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సి.రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఢిల్లీలో రెండు రోజుల పాటు సాగుతున్న ఈ సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు