రండి.. స్వచ్ఛంద సాయం అందించండి

8 Mar, 2016 03:26 IST|Sakshi

  దాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం
   చెరువుల దత్తత.. మిషన్ కాకతీయకు విరాళాలు
   సద్దిమూట.. బడిబాట.. డబుల్ బెడ్రూం ఇళ్లకు సాయం


 సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యతను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. తెలంగాణ అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కదులుతోంది. కార్పొరేట్ కంపెనీలు సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఏటేటా సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతాయి. వీటిని ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పనులకు వినియోగిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందనేది సర్కారు ఆలోచన. ఇందులో భాగంగానే గత ఏడాది ‘మిషన్ కాకతీయ’ చెరువుల పునరుద్ధరణకు విరాళాల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో తెలంగాణ ప్రవాసులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన వచ్చింది. దాదాపు రూ.17 కోట్ల విలువైన చెరువుల పునరుద్ధరణ పనులను దత్తత ద్వారానే చేపట్టారు. నిరుపేద దళితులకు భూముల పంపిణీ పథకం అమలులోనూ అదే తరహా ఫలితం కనిపించింది. పంపిణీకి అవసరమైన భూముల కొనుగోలుకు సర్కారు సిద్ధపడింది. పలువురు పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు స్వచ్ఛందంగా తమ భూములను సర్కారుకు అప్పగించేందుకు  ముందుకొచ్చారు. వాటికి చెల్లించే రేటును తమకు ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ డాక్టర్ ఉదారతను చాటుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఐదు మార్కెట్ యార్డుల్లో రైతులకు ఐదు రూపాయలకే భోజనం పెట్టే ‘సద్దిమూట’ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. మూడు మార్కెట్లలో ఈ పథకానికి అవసరమైన నిధులను తమవంతుగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ  సమకూరుస్తోంది. వండి వడ్డించే బాధ్యతలను హరేకృష్ణ సొసైటీ స్వచ్ఛం దంగా నిర్వహిస్తోంది. మరో రెండు మార్కెట్లలో స్థానిక వ్యాపారులే ఈ పథకానికి నిధులు సమకూరుస్తున్నారు. పంచాయతీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి అరబిందో ఫార్మా కంపెనీ ఇటీవలే రూ.1.10 కోట్ల విరాళం అందించింది. విద్యార్థుల సౌకర్యార్థం అక్కడి ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ బెంచీలను పంపిణీ చేసి ఉదారతను చాటుకుంది. కార్పొరేట్ కంపెనీలను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేసే బృహత్ ప్రయత్నానికి ఇవన్నీ మచ్చుతునకలుగా నిలిచాయి.

ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా అమలుకు శ్రీకారం చుట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలోనూ బడా కంపెనీలను భాగస్వాములను చేయాలని సీఎ కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు అధికారుల సమీక్షల్లో ప్రస్తావించారు. ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు కొన్ని నియోజకవర్గాలు, పట్టణాలను దత్తత ఇవ్వాలని యోచిస్తున్నారు.
 

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు