'తెలంగాణకు రూ.100 కోట్లు విడుదల'

2 Dec, 2015 16:25 IST|Sakshi

న్యూఢిల్లీ : తెలంగాణకు తక్షణ సాయం కింద రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బుధవారం న్యూఢిల్లీలో తెలిపారు. అలాగే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తామన్నారు. ఆ బృందం నివేదిక అందించిన వెంటనే రాష్ట్రానికి మరింత సాయం అందిస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్తో తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కరవు మండలాలను ఆదుకోవాలని కేంద్రమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు.

అలానే రాష్ట్రంలోని కరవు మండలాలకు రూ. 2, 514 కోట్లు సాయం అందించాలని కేంద్రమంత్రిని వారు కోరారు. కరవు మండలాలకు సంబంధించి ప్రాధమిక నివేదికను ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఈ సందర్బంగా తెలంగాణ మంత్రులు గుర్తు చేశారు. ఉద్యానవన వర్సిటీకి కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ జనవరి 7వ తేదీన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ యూనివర్శిటీ కోసం మెదక్ జిల్లా గజ్వేల్లో ఇప్పటికే స్థలం సిద్ధం చేశామని వారు చెప్పారు. ఆ భేటీ అనంతరం కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ తో కలసి  మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కడియం శ్రీహరిలు విలేకర్లతో మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు