మలేసియా జైళ్లలో తెలుగు కార్మికులు

1 Apr, 2016 19:46 IST|Sakshi

విజిట్ వీసాలపై మలేసియా వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వారిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్ జలన్‌భూత్ ప్రాంతంలోని నివాస గృహాలపై రెండు రోజుల క్రితం దాడులు చేపట్టిన అక్కడి పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా ఉంటున్నారనే కారణంతో దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

 కొంత కాలంగా అక్కడి సూపర్‌మార్కెట్‌లో పని చేస్తున్న నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్ వాసి నరేందర్ ‘సాక్షి’కి ఫోన్‌లో ఈ మేరకు సమాచారం అందించారు. తాజా దాడులతో మలేసియాలో పని చేస్తున్న తెలుగువారు భయాందోళనలకు గురవుతున్నారు.

 

నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ పట్టుబడిన వారిని జైళ్లలోనూ డిటెన్షన్ సెంటర్‌లలోనూ ఉంచుతున్నారు. ఆరునెలల కాలంలో రెండోసారి పోలీసులు దాడులు నిర్వహించారని నరేందర్ వివరించారు. అయితే పట్టుబడిన వారి వివరాలను గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఇక్కట్లు పడుతున్న తమను స్వగ్రామాలకు చేర్చాలని బాధితులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు