బ్యారేజీ కాదు.. ఆనకట్ట!

21 Jul, 2015 02:09 IST|Sakshi
బ్యారేజీ కాదు.. ఆనకట్ట!

తుమ్మిడిహెట్టిపై రాష్ట్ర ప్రభుత్వం యోచన
* బ్యారేజీకి రూ.1,800 కోట్ల ఖర్చు.. ఆనకట్టకు రూ.200 కోట్లు
* ప్రాణహిత-చేవెళ్లపై అధికారులతో సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో స్వల్ప మార్పులు చేయాలని యోచిస్తోంది. బ్యారేజీ కి బదులు ఆనకట్ట నిర్మించే దిశగా ఆలోచనలు చేస్తోంది.

వ్యయం తగ్గించడంతోపాటు మహారాష్ట్ర నుంచి ముంపు వివాదం లేకుండా ఉండేందుకే ఆనకట్ట నిర్మాణం వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణ అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది.
 
6 టీఎంసీలకు అంత ఖర్చు అక్కర్లేదు..
160 టీఎంసీల గోదావరి నీటితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం... పాత డిజైన్ ప్రకారం ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఉంటుందని, అక్కడ్నుంచి నీటిని మళ్లించి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలను తీరుస్తామని చెబుతోంది.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు కుదించి నీటిని నిల్వ చేయాలని భావించింది. అయితే ఇందుకు సుమారు రూ.1,800 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం ఉంది. కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఇంతస్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే బ్యారేజీ బదులు ఆనకట్ట కట్టాలని యోచిస్తోంది. 2 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే ఎత్తులో కేవలం రూ.200 కోట్ల ఖర్చుతో దీన్ని చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఆనకట్టలో నిల్వ చేసిన నీటిని... అవసరాన్ని బట్టి 80 నుంచి 120 రోజుల పాటు 15 టీఎంసీల వరకు మళ్లించుకోవచ్చని, దీనిద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 1.50 లక్షల ఎకరాలకు నీరందించవచ్చన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణం ఏ ఎత్తులో చేపట్టినా ముంపుపై మహారాష్ట్రకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీకి బదులు ఆనకట్ట వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఒకట్రెండు టీఎంసీలు ఉంటే దాన్ని ఆనకట్టగా, 2 నుంచి 8 టీఎంసీల వరకు ఉంటే బ్యారేజీగా పరిగణిస్తారు.
 
లైడార్ సర్వేకు ఓకే
కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో లైడార్ సర్వే నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. ఇప్పటికే ఇక్కడ సర్వే చేసేందుకు కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు అనుమతినిచ్చాయి.
 
రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు
ప్రాజెక్టుల డిజైన్‌లో మార్పుచేర్పుల్లో భాగంగా మరో రెండు రిజార్వయర్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచనుంది. ఇప్పటికే మెదక్ జిల్లాలోని పాములపర్తి, తడ్కపల్లి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా నల్లగొండ జిల్లాలోని బస్వాపూర్, గంధమల రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది.

ఈ మేరకు సోమవారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గంధమల రిజర్వాయర్‌ను 0.5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు, బస్వాపూర్ రిజర్వాయర్‌ను 0.8 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు కాళేశ్వరం, ఎల్లంపల్లి అలైన్‌మెంట్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లుగా సమాచారం.

మరిన్ని వార్తలు