ఉద్యోగం రాదనే బెంగతో యువకుడు ఆత్మహత్య

22 Sep, 2015 08:38 IST|Sakshi

పేదరికంతో ఎంబీఏ చదువుకు ఆటంకం
ఉయ్యాలవాడ:
'తమ్ముడిని పై చదువులు చదివించుకోలేకపోయాం. నా చదువూ మధ్యలోనే ఆగిపోయింది. చిన్న ఉద్యోగం చేద్దామన్నా దొరకడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదమ్మా అని బాధపడేవాడు. ఇలా ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదు.' అని పెద్ద సంజీవరాయుడు తల్లి వరాలు గుండెలవిసేలా రోదించింది. ఉద్యోగం రాదనే బెంగతో కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన సాలె పెద్ద సంజీవరాయుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సాలె సంజీవరాయుడు, వరాలు దంపతులకు ఇద్దరు కుమారులు. ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో చిన్నకుమారుడు 10వ తరగతితో చదువు మానేశాడు. పెద్ద కుమారుడు పెద్ద సంజీవరాయుడు ఆర్థిక పరిస్థితి సహకరించక ఎంబీఏ మధ్యలోనే మానేశాడు. అప్పటి నుంచి ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఇక తనకు ఉద్యోగం రాదనే బెంగతో ఈనెల 19న ఇంటినుంచి వెళ్లిపోయిన అతడు పెద్దయమ్మనూరు, కొండుపల్లె గ్రామాల మధ్య కేసీ కెనాల్ సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతదేహాన్ని గుర్తించారు. ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు