వీఏకే రంగారావుకు నాట్యవిశారద బిరుదు

29 Dec, 2015 21:38 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ విమర్శకుడు, నృత్య కళాకారుడు వీఏకే రంగారావు నాట్య కళావిశారద బిరుదును అందుకున్నారు. శ్రీకృష్ణ గానసభ మంగళవారం నాట్యకోవిదులు సీవీ చంద్రశేఖర్ చేతుల మీదుగా రంగారావును ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కళలకు జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి రంగారావు అని కొనియాడారు. అనేక రంగాల్లో ప్రవేశం కలిగిన రంగారావుకు సకల కళావిశారదుడు అనే బిరుదును ప్రదానం చేయడం సముచితమని శ్రీకృష్ణ గానసభ కన్వీనర్ స్వప్న సుందరి అన్నారు.

వీఏకే రంగారావు మాట్లాడుతూ వివిధ రంగాల్లో తన ప్రవేశానికి బాటలు వేసి స్ఫూర్తిగా నిలిచిన మల్లాది రామకృష్ణశాస్త్రి, ఆరుద్రలకు ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తున్నానన్నారు. సంగీత, సాహిత్య, సాంస్కృతిక ఇలా ప్రతి రంగంలోనూ వంద శాతం పరిపూర్ణత సాధించేందుకు తపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణగాన సభ కార్యదర్శి వై.ప్రభు అధ్యక్షత వహించారు.
 

మరిన్ని వార్తలు