ఆ ఒప్పందాలను బయట పెట్టండి

11 Jul, 2015 04:26 IST|Sakshi
ఆ ఒప్పందాలను బయట పెట్టండి

సాక్షి, హైదరాబాద్: విదేశీ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల గుట్టును బయట పెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటనలకు పారదర్శకత లేకుండా పోతోందన్నారు. జపాన్ ప్రధాని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే ఆ వెనుక ఉన్న ఒప్పందమేమిటో బహిర్గతం చేయాలన్నారు. విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు ఎంతో స్పష్టం చేయాలన్నారు.

చైనా, జపాన్, సింగపూర్‌లతో చేసుకున్న ఒప్పందాలనూ బహిర్గతం చేయాలన్నారు. విజయవాడ భవానీదీపాన్ని చైనాకు, అమరావతిని జపాన్‌కు, హీరో హోండా కంపెనీకి 600 ఎకరాలు కట్టబెట్టిన చంద్రబాబు ఆ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలతో పాటు గతంలో ఏ ప్రభుత్వం, ఏ కంపెనీకి ఇవ్వని విధంగా ఏషియన్ పెయింటింగ్స్‌కు కల్పించిన రాయితీల వెనకున్న నిగూఢత్వాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
 
సెటిల్‌మెంటు ఆపండి...: ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడి ఘటనలో సెటిల్‌మెంట్ జోలికి పోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో వనజాక్షిపై భౌతిక దాడులకు పాల్పడినా చంద్రబాబు నేతృత్వంలో రాజీ ప్రయత్నం చేస్తుండటం సిగ్గుచేటన్నారు.  ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా తహశీల్దార్ ఇంటికి ఇద్దరు మంత్రులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏం మాట్లాడారో స్పష్టం చేయాలన్నారు. సోమవారం చర్చలు జరుపుతామని మంత్రులు పేర్కొనడాన్ని ఆక్షేపించారు.

మరిన్ని వార్తలు