ఫొటోతో వాహన రిజిస్ట్రేషన్

4 Aug, 2015 01:21 IST|Sakshi
ఫొటోతో వాహన రిజిస్ట్రేషన్

ఆర్‌సీ కార్డుపై యజమాని ఫొటో ముద్రణ
* వాహన నేరాలకు కళ్లెం వేసే దిశగా చర్యలు
* రవాణాశాఖ కసరత్తు
* పాత వాహనాలకూ అమలు!  
* నేడు ప్రారంభించనున్న రవాణాశాఖ మంత్రి
* రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా..

సాక్షి, హైదరాబాద్: వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక నుంచి యజమాని ఫొటో తప్పనిసరి. ‘వాహన నేరాల’కు కళ్లెం వేసేందుకు వాహనాల ఆర్‌సీ(రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డుపై యజమాని ఫొటోను కూడా ముద్రించనున్నారు.

రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మంగళవారం దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బుధవారం నుంచి ఇది రాష్ట్రవ్యాప్తం గా అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించే విషయంలో గందరగోళం నెలకొం టోంది. వాహనం నడుపుతూ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి- ఆ వాహనానికి సంబంధమే ఉండడం లేదు. దానిపై చలానాలు విధించినప్పుడు తాను ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదని అసలు యజమానులు పేర్కొంటున్నారు.

డ్రైవర్-వాహన యజమాని ఒక్కరా కాదా అనే విషయంలోనూ అధికారులకు స్పష్టత ఉండడం లేదు. ఇక ఒకే నంబర్‌తో రెండుమూడు వాహనాలు ఉంటున్నాయి. కారుకు, ద్విచక్రవాహనానికి కూడా ఒకే నంబరు ఉంటున్న దాఖలాలున్నాయి. వీటితోపాటు తప్పుడు రిజిస్ట్రేషన్లు, దొంగ వాహనాలను మరొకరి పేర తప్పుడు పత్రాలతో బదిలీ చేయడం, అసలు యజమాని ప్రమేయం లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకు రుణాలు పొందడం వంటి ఘటనలు ఎక్కువైన నేపథ్యంలో పోలీసు, రవాణా శాఖలు దీనిపై దృష్టిసారించాయి.

అందులో భాగంగానే ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక ఇప్పటికే రిజిస్ట్రేషన్ జరిగిన పాత వాహనాలను కూడా దశలవారీగా ఈ కొత్త విధానం పరిధిలోకి తేనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటో జతచేసే డ్రైవ్ చేపట్టడం లేదని, ఏదైనా ప్రక్రియ కోసం రవాణాశాఖకు వచ్చినప్పుడు ఫొటోను జతచేసే పని చేపడతామని ఆయన చెప్పారు.
 
ఆర్‌టీఏలో హెల్మెట్ తప్పనిసరి..!
రక్షణశాఖ కార్యాలయ ప్రాంగణానికి వెళ్లేప్పుడు ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నారు. తాజాగా రవాణాశాఖ కూడా ఇదే విధానా న్ని అమలు చేయబోతోంది. అప్పట్లో హెల్మెట్ల వాడకాన్ని తప్పనిసరి చేయడంపై వ్యతిరేకత రా వడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. అయితే వాహనాలతో ముడిపడిన కార్యాలయ ప్రాంగణంలోకి ద్విచక్రవాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలనే ఆ నిబంధనను తప్పనిసరి చేయాలని రవాణాశాఖ భావిస్తోంది. దీనిపై త్వరలో ప్రకటన చేయనున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు