పల్లెలకు సరికొత్త రూపు

26 Jul, 2015 01:08 IST|Sakshi
పల్లెలకు సరికొత్త రూపు

అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లెలకు సరికొత్త రూపునిచ్చేందుకు గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి ప్రణాళికలు ఉంటాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై శనివారం ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

గ్రామ పంచాయతీల ప్రాథమిక విధులైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ.. తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, ఏడాది కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రణాళికల్లో పొందుపరుస్తామన్నారు. మన ఊరు-మన ప్రణాళిక ద్వారా గతంలో ప్రజల నుంచి సేకరించిన సూచనలను, సలహాలను తాజాగా చేపట్టిన ప్రణాళికల రూపకల్పనకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

ప్రతి గ్రామాన్ని వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లె మాదిరిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రణాళికల ద్వారా నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని చెప్పా రు. స్వయం సహాయక సంఘాల, రిటైర్డు ఉద్యోగుల సహకారం తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు