‘బసవ తారకం’ ట్రస్టీ తులసీదేవి కన్నుమూత

13 Oct, 2019 04:58 IST|Sakshi

హైదరాబాద్‌/తెనాలి రూరల్‌: బంజారాహిల్స్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాపనలో కీలకపాత్ర పోషించి.. వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న డాక్టర్‌ పోలవరపు తులసీదేవి (80) శనివారం గుండెపోటుతో న్యూయార్క్‌లోని తన నివాసంలో మరణించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన తులసీదేవి న్యూయార్క్‌ నగరంలో గైనకాలజిస్టుగా స్థిరపడ్డారు. ఆమె భర్త డాక్టర్‌ రాఘవరావు ఆర్థోపెడిక్‌ సర్జన్‌. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

పేద రోగులకు అందుబాటు ధరల్లో చికిత్స అందించే ప్రపంచ శ్రేణి క్యాన్సర్‌ చికిత్సా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఎన్టీ రామారావు సంకల్పించగా.. అమెరికాలో ఇండో–అమెరికన్‌ క్యాన్సర్‌ ఆర్గనైజేషన్‌ పేరిట స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అమెరికాలో ఉన్న సుప్రసిద్ధ వైద్యులు, ఇతర తెలుగు వారిని ఏకం చేసి సంస్థ స్థాపనకు అవసరమైన నిధులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందించడంలో తులసీదేవి ఎంతో కృషి చేశారు.

తన స్వగ్రామమైన కంఠంరాజు కొండూరులో తండ్రి కారుమంచి గోవిందయ్య పేరిట ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. అమెరికాలో వైద్యపరమైన లాంఛనాలు పూర్తి కాగానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు రానున్నట్టు డాక్టర్‌ కె.తుకారాం ప్రసాద్‌ తెలిపారు. కాగా, క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు, నిర్వహణలో కీలక భూమిక పోషించిన తులసీదేవి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆస్పత్రి చైర్మన్, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు