విదేశాలకూ నిధుల మళ్లింపు?

3 Jan, 2020 03:22 IST|Sakshi

రాయపాటి కేసులో సీబీఐ ఆరా

ట్రాన్స్‌ట్రాయ్‌ ఖాతా లావాదేవీలపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ సంస్థ ఖాతాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇతర ఖాతాలకు నిధులు మళ్లించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఎంత డబ్బు రుణాల రూపంలో వచ్చింది.. వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఏయే ఖాతాలకు ఎంతెంత మళ్లించారు? అలా మళ్లించిన వాటిలో విదేశీ ఖాతాలు కూడా ఉన్నాయా? తదితర విషయాల గురించి ఆరా తీస్తున్నారని సమాచారం. ట్రాన్స్‌ట్రాయ్‌ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సంస్థకు పోలవరం పనులు కట్టబెట్టడంపై అప్పట్లో  పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే.

2015లో ఖాతాను స్తంభింపజేసినా..
ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, 2015లోనే బ్యాంకుల కన్సార్షియం సదరు సంస్థ ఖాతాను ఎన్‌పీఏ (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్‌ – నిరర్థక ఖాతా)గా ప్రకటించింది. దీంతో ఇతర ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణ లున్నాయి. దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. ఇతర ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించారని సీబీఐ అనుమానిస్తోంది. రూ.264 కోట్ల నిధుల మళ్లింపుపై యూనియన్‌ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న క్రమంలో ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్నట్లు తెలిసింది.

అంత బంగారం ఎక్కడిది.?
ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ పలుమార్లు ఇచ్చిన విరాళాలపైనా సీబీఐ దృష్టి సారించినట్లు సమాచారం. 2012 నవంబర్‌ 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన బంగారు చీరను కానుకగా సమర్పించారు. ఆ బంగారు చీర తయారీకి ఎనిమిది కిలోల బంగారం (8086.97 గ్రాములు), 879.438 గ్రాముల వజ్రాలు, పగడాలు ఉపయోగించడం గమనార్హం. 2013 డిసెంబర్‌ 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.3.42 కోట్లు విరాళంగా ఇచ్చారు.  ఈ నిధులు వారికి ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. కాగా, 2013కు ముందు ఈ సంస్థ ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్‌ షీట్లను కూడా పరిశీలించనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు