చబ్బీ గర్ల్స్‌

25 Oct, 2017 08:23 IST|Sakshi

చార్మింగ్ కాస్ట్యూమ్స్
ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రతి ‘బాడీ’కీ ఓ ‘లెక్క’ ఉంటుంది. జీరో సైజ్‌లో ఉన్నవారే కాదు.. బొద్దుగుమ్మలు కూడా క్యాట్‌వాక్‌లతో అదరగొడుతున్నారు. అయితే స్లిమ్‌ అమ్మాయిలకి ఎలాంటి డ్రెస్‌ వేసినా అందంగానే ఉంటుంది. మరి బొద్దుగా ఉండేవారి మాటేంటి..! వారు డ్రెస్సింగ్‌ కేర్‌ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇలాంటి వారి కోసం కొత్త సూత్రాలు చెబుతున్నారు సిటీ డిజైనర్లు.

ప్రస్తుత సిటీ లైఫ్‌స్టైల్‌ వద్దంటున్నా... అమ్మాయిలను బొద్దుగా మార్చేస్తోంది. ఏ పార్టీకో, పెళ్లికో, పేరంటానికో వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. కాస్త లావుగా ఉన్నందుకు ఎందరు కామెంట్‌ చేస్తారోనని భయపడుతుంటారు. ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియక తికమక పడుతుంటారు. వీరు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏ రంగులు వేసుకోవాలనే దానిపై డిజైనర్ల సూచనలు.  

డార్క్‌ కలర్స్‌ బెటర్‌..
మేని ఛాయ బంగారంలా మెరిసిపోయే ‘చబ్బీ గర్ల్స్‌’ ముదురు రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది. లేత రంగులైతే శరీరతత్వాన్ని బయటపెడతాయి. కాళ్లు కాస్త లావుగా ఉంటే డార్క్‌ కలర్‌ బోటం, లేత రంగు టాప్‌ ధరిస్తే బెటర్‌. కానీ టాప్స్‌ మాత్రం నడుము కింది భాగం వరకు ఉండేలా చూసుకుంటే మంచిది. చేతులు లావుగా ఉంటే స్లీవ్‌ లెస్‌లు, మెగా స్లీవ్‌లను కాకుండా ఎక్కువ శాతం త్రీఫోర్త్‌లను, ఫుల్‌ హాండ్స్‌ టాప్స్‌లనే ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. వేసుకునే డ్రెస్‌ లేదా చీరపై చిన్నచిన్న బొమ్మలు, పూలు ఉండేటట్టు చూసుకుంటే సన్నగా కనిపిస్తారు. పెద్ద పూలు, పెద్ద బొమ్మలున్నవి వేసుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఎక్కువంటున్నారు.  

ప్యాంట్, షర్ట్స్‌లో అయితే..
అడ్డ గీతల ప్యాంట్లు, షర్టులు, టాప్‌లు వేసుకుంటే ఉన్న దానికంటే ఇంకా లావుగా కనిపిస్తారు. అలాంటప్పుడు నిలువు గీతల కాస్ట్యూమ్స్‌ చాలా బాగా నప్పుతాయి. ఇవి సన్నగా పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. కాస్త ట్రెండీగా కనపడాలనుకునే చబ్బీస్‌.. మార్కెట్‌లో ఎన్నో రకాల నెట్టెడ్‌ అండ్‌ స్పన్‌ ష్రగ్స్‌ లేదా ఓవర్‌ కోట్స్‌ చాలానే దొరుకుతున్నాయి. వాటిని టాప్‌ మీద ధరిస్తే బాగుంటుంది. కాస్ట్యూమ్స్‌ మాత్రమే కాకుండా, పెద్ద ఇయర్‌ టాప్స్, స్లిమ్‌ హ్యాండ్‌ బ్యాగ్, ఎత్తుని బట్టి అందమైన సాండల్స్‌తో పాటు లైట్‌ మేకప్‌ వేసుకుంటే చాలు.. లుక్‌ మారిపోతుంది. దీనికి కాస్త కాన్ఫిడెన్స్‌ను కూడా అద్దితే టోటల్‌గా లుక్కే మారిపోతుందని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్లు ప్రియ, రూప. 

మరిన్ని వార్తలు