‘లైసెన్స్‌’ సాయం 

9 May, 2018 08:56 IST|Sakshi

సౌత్‌ డిస్ట్రిట్‌ ట్రాఫిక్‌ పోలీసుల ప్రయోగం 

ప్రతి ఠాణాలోనూ హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు 

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందటంలో సహకారం 

వేసవి నేపథ్యంలో పరదాలు: డీసీపీ–2 

సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలో ఉన్న వాహనాల సంఖ్యలో సగం కూడా డ్రైవింగ్‌ లైసెన్సులు లేవు. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతున్న కేసుల్లో అత్యధికం ఈ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్‌ డీసీపీ–2 బాబూరావు ప్రత్యేక మేళా ఏర్పాటు చేశారు. దీనికి వచ్చిన స్పందన చూసి ప్రతి ఠాణాలోనూ హెల్ప్‌డెస్క్‌ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఇవి పని చేయనునున్నాయి. మరోపక్క వేసవి తీవ్రత నేపథ్యంలో వాహనచోదకులకు ఉపశమనం కోసం పాతబస్తీలోని జంక్షన్లలో పరదాలు ఏర్పాటు చేస్తున్నారు.  

కారణాలనేకం... 
నిరక్షరాస్యత, అవగాహన లేమి, అందుబాటులో లేని వనరులు, తదితర కారణాల నేపథ్యంలో పాతబస్తీకి చెందిన అనేక మంది వాహనచోదకులు డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకోవట్లేదు. గతంలో సౌత్‌జోన్‌ అదనపు డీసీపీగా పని చేసిన బాబూరావుకు ఈ విషయంపై అవగాహన ఉండటంతో ఆయన ఈ అంశాన్ని ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. పాతబస్తీ ప్రజల కోసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళా ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఆర్టీఏ అధికారులతో సంప్రదింపుల అనంతరం అనిల్‌కుమార్‌ ఫలక్‌నుమా ప్రాంతంలో సోమ–మంగళవారాల్లో ప్రత్యేక మేళా ఏర్పాటు చేయించారు. దాదాపు 1200 మంది రిజిస్టర్‌ చేసుకోవడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్లాట్‌ బుక్‌ చేయించుకున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు.  

ప్రతి ఠాణాలోనూ డెస్క్‌  
ప్రత్యేక డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళా నిర్వహణ కోసం 20 మంది ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్‌ లైసెన్సుల స్లాట్స్‌ బుక్‌ చేయడం, ఆన్‌లైన్‌ టెస్ట్‌కు సంబంధించిన అంశాలను స్లాట్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించడం వంటివి వీరికి నేర్పారు. మేళాలో విధులు నిర్వర్తించిన ఈ కానిస్టేబుళ్లు బుధవారం నుంచి వారి ట్రాఫిక్‌ ఠాణాల్లోనే ఉంటారు. వీరి నేతృత్వంలో పాతబస్తీలోని 12 ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పరిధులకు చెందిన వారు ఎవరైనా ఆర్టీఏ స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి ఈ డెస్క్‌ను సంప్రదిస్తే, సిబ్బంది స్లాట్‌ బుక్‌ చేయడంతో పాటు ఆన్‌లైన్‌ టెస్ట్‌పై అవగాహన కల్పిస్తారు. ఎల్‌ఎల్‌ఆర్‌ వచ్చిన తర్వాత ట్రాక్‌ టెస్ట్‌కు అవసరమైన స్లాట్స్‌ బుక్‌ చేయడం, సహాయం చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. బుధవారం నుంచి ఈ డెస్క్‌లు పని చేయనున్నాయి.  

ఇదీ పాతబస్తీ పరిస్థితి
2017 జనవరి–ఏప్రిల్‌ మధ్య డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడానికి సంబంధించి  8727 కేసులు నమోదయ్యాయి. ఇందుళక్ష సౌత్‌ డిస్ట్రిట్‌లోనే 5483 (62.82 శాతం) నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో నగర వ్యాప్తంగా 5735 కేసులు నమోదు కాగా... పాతబస్తీతో కూడిన సౌత్‌ డిస్ట్రిట్‌లోనే 3138 (54.71 శా>తం) రిజిస్టర్‌ అయ్యాయి.  

పరదాలు ఏర్పాటు చేస్తున్నాం 
‘డ్రైవింగ్‌ లైసెన్స్‌లేని వాహనచోదకులకు ఈ హెల్ప్‌డెస్క్‌లు సహకారం అందిస్తాయి. మరోపక్క వేసవి నేపథ్యంలో పగటి పూట ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగుతున్న వాహనచోదకులు ఎండ వేడితో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీలోని రద్దీ జంక్షన్లలో పరదాలు ఏర్పాటు చేస్తున్నాం. బహదూర్‌పుర చౌరస్తాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. శాలిబండ, చంద్రాయణగుట్ట జంక్షన్లలో బుధవారం ఏర్పాటు చేయనున్నాం. వారంలో మరికొన్ని చోట్ల ఇవి అందుబాటులోకి వస్తాయి. పరదాలు ఏర్పాటు చేయడంతో పాటు పాయింట్‌ డ్యూటీలో ఉండే సిబ్బంది, అధికారులు వీటిని నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నాం.’ 
– కె.బాబూరావు, ట్రాఫిక్‌ డీసీపీ–2 

మరిన్ని వార్తలు