సికిల్‌సెల్‌ ఎనీమియాకు మెరుగైన చికిత్స

23 Sep, 2017 02:11 IST|Sakshi

రూ.54 కోట్లతో కొత్త ప్రాజెక్టు: సీసీఎంబీ డైరెక్టర్‌

సాక్షి, హైదరాబాద్‌: సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధిని ఎదుర్కొనేందుకు కౌన్సిల్‌ ఫర్‌ సైంటి ఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) నడుం బిగించింది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) నేతృత్వంలో ఈ వ్యాధిని సులువుగా గుర్తించేందుకు చికిత్స విధానాలను మెరుగుదలకు ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.54 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శుక్రవారం సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది పిల్లలు ఈ వ్యాధిబారిన పడుతున్నారని, వీరిలో సగం మంది భారత్‌లోనే ఉన్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న గిరిరాజ్‌ ఛాందక్‌ మాట్లాడుతూ జన్యు మార్పుల కారణంగా సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధిగ్రస్తుల్లోని రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయని, ఫలితంగా రక్తహీనత, విపరీతమైన ఒళ్లునొప్పులు వస్తుంటాయని వివరించారు. భారత్‌లో ఈ వ్యాధిగ్రస్తులు చత్తీస్‌గఢ్‌లో ఎక్కువగా ఉండగా.. ఏపీతో పాటు మహారాష్ట్ర, ఒడిశాల్లోనూ వ్యాధిబారిన పడిన వారు ఉన్నారని తెలిపారు. సికిల్‌సెల్‌ ఎనీమియాకు సమర్థమైన చికిత్స అందించడమే కాకుండా అతిచౌకగా వ్యాధి నిర్ధారణ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు