నగరంలో స్వైన్‌ఫ్లూ విజృంభణ

11 Jan, 2019 00:46 IST|Sakshi

ఎనిమిది స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌లో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు తోడు చలితీవ్రత వల్ల ఫ్లూ కారక వైరస్‌ విజృంభిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో సిద్దిపేటజిల్లా కొండపాకకు చెందిన వ్యక్తి(39), ఉప్పల్‌ సౌత్‌ స్వరూప్‌నగర్‌కు చెందిన మహిళ(28), అల్వాల్‌లోని ఇంద్రానగర్‌కు చెందిన మహిళ(43)లకు పాజిటివ్‌ కేసులు గురువారం నమోదు కాగా, మరో నలుగురు ఫ్లూ అనుమానితులు చికిత్స పొందు తున్నారు. ఉస్మానియాలో పాతబస్తీకి చెందిన మహిళ(64), వ్యక్తి(48), యువకుడు(34), వృద్ధుడు(60), మహిళ(45)లకు కూడా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే గతేడాది గాంధీలో 72 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో 18 మంది మృత్యువాత పడ్డారు. 54 మంది చికిత్స తర్వాత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఉస్మానియాలో 33 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో 11 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో అత్యధిక శాతం మహిళలే ఉండటం గమనార్హం.  

ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందే.. 
సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్‌ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు.  నిజానికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు,గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ బారిన పడే అవకాశాలు ఎక్కువ.    సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి.ముఖ్యంగా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి.  బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రపరచుకోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. మూడు రోజులు కంటే ఎక్కువ పై లక్షణాలు వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.  ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధి లక్షణాలను ముందే గుర్తించటం ద్వారా పూర్తిగా నివారించే అవకాశం ఉంది. స్వైన్‌ఫ్లూ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  
– డాక్టర్‌ శ్రీధర్, స్వైన్‌ఫ్లూ నోడల్‌ ఆఫీసర్, ఉస్మానియా ఆస్పత్రి   

మరిన్ని వార్తలు