ఆన్‌లైన్‌ వేదిక ..కళా వీచిక

25 Oct, 2017 08:17 IST|Sakshi
నిర్వాహక బృందం

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇక ఈజీ

ఒకే గొడుకు కిందకు విభిన్న కళాకారులు  

తెలంగాణ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు శ్రీకారం

త్వరలో అందుబాటులోకి ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌

ఒక్క క్లిక్‌తో సమాచారం

మహా నగరంలో వేడుకలు సర్వసాధారణంగా మారాయి. హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌ రోజురోజుకూ తన ప్రతిష్ట పెంచుకుంటోంది. ఇదే క్రమంలో ఈవెంట్, ఆర్టిస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, ఆర్టిస్టులకు మధ్య వారధి రూపుదిద్దుకుంటోంది. నగరానికి చెందిన విభిన్న రంగాల ప్రముఖుల ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా త్వరలోనే ప్రత్యేక వేదిక వెలుగులోకి రానుంది. గూగుల్, యాహూ తరహాలో ఆర్టిస్ట్‌ల కోసం ఇదో ప్రత్యేక సెర్చ్‌ ఇంజిన్‌ అని నిర్వాహకులు దీనిని నిర్వచిస్తున్నారు.

నగరానికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌ తన కూతురు బర్త్‌డే పార్టీ గ్రాండ్‌గా చేయాలనుకున్నారు. ఇందుకు ఓ ఈవెంట్‌ మేనేజర్‌ను కలిస్తే అన్ని పనులూ అయిపోతాయన్నారు. అయితే సదరు ఈవెంట్‌ మేనేజర్‌ ఎవరు? గత అనుభవం ఏమిటి? ఎలా నమ్మాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆయన మదిలో మెదిలాయి. ఓ యువతి ఈవెంట్‌ నిర్వహణను వృత్తిగా చేపట్టాలనుకుంది. అయితే ఈవెంట్‌ను రక్తికట్టించే డెకరేటర్లు, డీజేలు, మోడల్స్, డ్యాన్సర్స్, సింగర్స్, మ్యూజిషియన్స్, ఫొటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్‌ తదితరులంతా ఎక్కడ? వారి సమాచారం ఎవరిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే పనిలో నిమగ్నమయ్యారు నగరానికి చెందిన భిన్న రంగాల ప్రముఖులు. ఈవెంట్‌ నిర్వహణ, దాని సక్సెస్‌కు అవసరమైన ఎన్నో వృత్తులు, ఎందరో వ్యక్తులు, మరెన్నో సంస్థలు... అన్నింటినీ ఒకే చోటకు చేర్చనున్నారు. ఇందుకు తెలంగాణ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (www.tartists.in) పేరుతో సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టనున్నారు.  

ఆలోచన.. ఆచరణ
‘సిటీలో ఈవెంట్స్‌ బాగా పుంజుకున్నాయి. ఇతర నగరాల నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం సర్వసాధారణంగా మారింది. అలాగే ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నా.. వారికి నగరంలో జరిగే ఈవెంట్లలో చోటు దక్కడం లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నాం’ అని చెప్పారు షరాన్‌ ఇనాయహ్‌ ఖాన్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవెంట్‌ మేనేజర్లు ఒక్క క్లిక్‌తో ఆర్టిస్టులను బుక్‌ చేసుకునే అవకాశాన్ని తమ వేదిక అందిస్తోందన్నారామె. దీంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని, మోసాలు, వివాదాలు కూడా ఉండబోవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రారంభం కానప్పటికీ ఇప్పటికే 150 మంది ఆర్టిస్టులు తమ పేర్లు నమోదుకు సై అన్నారని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని చెప్పారు.  

ఇదీ  బృందం
గతంలో మోడల్‌గా, నగరానికి చెందిన తొలి మహిళా డీజేగా వార్తల్లో నిలిచిన షరాన్‌... ఈ వేదికకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సిటీలో ప్రస్తుతం టాప్‌ డీజేగా కొనసాగుతున్న డీజే పియూష్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, దేశవ్యాప్త ప్రాచుర్యం పొందిన, నగరానికి చెందిన తొలి కొరియోగ్రాఫర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ జనరల్‌ సెక్రటరీగా ఇందులో పాలుపంచుకుంటున్నారు. ప్రముఖ నటి జమున కుమార్తె, చిత్రకారిణి స్రవంతి జల్లూరి జాయింట్‌ సెక్రటరీగా, మేకప్‌ కళాకారిణి అలియాబేగ్‌ ట్రెజరర్‌గా వ్యవహరిస్తున్నారు. సిటీ బ్లాగింగ్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. అటు ఫ్యాషన్‌ బ్లాగర్‌గా, ఇటు యోగా ట్రైనర్‌గానూ రాణిస్తున్న ఇషా హిందోచా తదితరులు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా ఉన్నారు.

మరిన్ని వార్తలు