వర్షం ఎఫెక్ట్‌ : 'బతుకమ్మ'కు గిన్నిస్‌ మిస్‌

29 Sep, 2017 00:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆడ బిడ్డల ముఖ్య పండుగ, రాష్ట్ర పండుగ బతుకమ్మ గిన్నిస్‌ రికార్డును మిస్సయింది. వర్షం భారీగా పడటంతో రికార్డు చేజారింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ(మహా బతుకమ్మ) సంబురం జరుగుతుండగా.. ఎల్బీ స్టేడియంలో కూడా దాదాపు మూడు వేల మందితో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కేలా ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్లాన్‌ చేశారు. ఇందుకోసం 300 మంది టీం లీడర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపాలనుకున్నారు. ఆ మేరకే ఉదయం 10 గంటలకు సద్దుల బతుకమ్మ ఉత్సవం ప్రారంభమైంది. మహిళలంతా తంగేడు పూల ఆకృతిలో చేరి మరింత ఆకర్షణీయంగా కనిపించారు.

బతుకమ్మ పూలతో తివాచీ ఏర్పాటుచేశారు. ఇందుకోసం మహిళలు ప్రత్యేకంగా పసుపు పచ్చని చీరలు, ఆకుపచ్చని చీరలతో స్టేడియానికి చేరారు. అయితే, అనుకోని విధంగా వర్షం రావడంతో అనుకున్న విధంగా బతుకమ్మ ఫీట్‌ చేయలేక గిన్నిస్‌ రికార్డు మిస్సయింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వర్షం వల్ల గిన్నిస్‌ రికార్డు చేయలేకపోయామన్నారు. అటెంప్ట్‌ మాత్రమే ఫెయిల్‌ అయిందని, కచ్చితంగా రికార్డ్‌ నెలకొల్పుతామని, వీలైతే నవంబర్‌లో మరోసారి బతుకమ్మ గిన్నిస్‌ రికార్డును నెలకొలకొల్పడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గిన్నిస్‌ రికార్డ్‌ అధికారి స్వప్నిల్‌ మాట్లాడుతూ మహా బతుకమ్మ గిన్నిస్‌ రికార్డ్‌ మిస్సయిందని, బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైం అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు