‘ఛత్తీస్’ విద్యుత్ డౌటే!

17 Jun, 2016 00:45 IST|Sakshi
‘ఛత్తీస్’ విద్యుత్ డౌటే!

* తక్కువకే కరెంట్ ఇస్తామంటూ ధర పెంచేసిన ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ
* రూ.2.71 నుంచి రూ.3.14కు, తాజాగా రూ.3.90కు పెంపు
* సుంకాలు, ఇతర భారాలు కలిపితే యూనిట్ ధర రూ. 5పైనే
* రూ. 3.50-రూ. 4కే మార్కెట్లో లభిస్తున్న విద్యుత్
* ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో ఏటా రూ.750 కోట్ల నుంచి 1,000 కోట్ల భారం!
* ధర తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం మీమాంసలో పడింది. తక్కువ ధరకే విద్యుత్ విక్రయిస్తామని తొలుత పేర్కొన్న ఛత్తీస్‌గఢ్ తాజాగా అమాంతంగా ధరను పెంచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది.

ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడం తెలిసిందే. యూని ట్‌కు రూ.2.71 చొప్పున ఈ విద్యుత్‌ను విక్రయిస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ డిస్కం 2015-16లో ఆ రాష్ట్ర ఈఆర్సీకి సమర్పించిన వార్షిక  ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)లోనూ ఇదే ధరను ప్రతిపాదించింది. అయితే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ నియంత్రణ మండలి అప్పట్లో ధరను రూ.3.14కు పెంచి టారీఫ్ ఆర్డర్‌ను జారీ చేసింది.

తాజాగా 2016-17కు సంబంధించి జారీ చేసిన టారీఫ్ ఆర్డర్‌లో ఈఆర్సీ మరోసారి ‘మార్వా’ విద్యుత్ ధరను పెంచేసి రూ.3.90గా ఖరారు చేసింది. మరోవైపు మార్వా విద్యుత్ కేంద్రానికి కేటాయించిన బొగ్గు గని ఉత్పత్తికి సిద్ధం కాకపోవడంతో కేంద్రం మూడేళ్ల కోసం తాత్కాలిక బొగ్గు కేటాయింపులు చేసిన విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది. స్థిరవ్యయం రూ.2.70, చర వ్యయం రూ.1.20 కలిపి ‘మార్వా’ విద్యుత్ ధర రూ.3.90 ఉంటుం దని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ లెక్కగట్టింది. ఇంధన సర్దుబాటు చార్జీ అదనమని స్పష్టం చేసింది.

తాత్కాలిక బొగ్గు విని యోగంతో చర వ్యయం రూ.1.20 నుంచి రూ.1.50కు పెరగనుంది. దీంతో యూనిట్ ధర రూ. 3.90 నుంచి 4.20కు పెరగనుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ తరలించేందుకు  యూనిట్‌పై చెల్లించాల్సిన 70 పైసల ట్రాన్స్‌మిషన్ చార్జీలు కలిపితే ఈ ధర రూ.4.90కు చేరనుంది. అదనంగా నీటి చార్జీలు, పెన్షన్లు, గ్రాట్యుటీ, స్టార్టప్ చార్జీలు, విద్యుత్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ పేర్కొనడంతో రాష్ట్రానికి విద్యుత్ వచ్చేసరికి ధర రూ.5 నుంచి రూ. 5.50 మధ్య ఉండనుంది.
 
పునరాలోచన లేదు
ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఒప్పందం జరిగింది కాబట్టి పునరాలోచన చేయలేం. పన్నులు, సుంకాలతోపాటు కొన్నింటిని ఛత్తీస్‌గడ్ రాష్ట్రమే భరించాలని చెప్పాం. రాష్ట్రానికి విద్యుత్ కారిడార్ అవసరం కావడంతోనే ఈ ఒప్పందం చేసుకున్నాం.
- డి.ప్రభాకర్‌రావు, టీ ట్రాన్స్‌కో సీఎండీ
 
మార్కెట్లో ఇంకా తక్కువకే...
ప్రస్తుతం మార్కెట్లో రూ.3.50 నుంచి రూ.4 కే విద్యుత్ లభిస్తుండగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌కు ప్రతి యూనిట్‌పై రూ.1 నుంచి రూ. 1.50 వరకు అధికంగా చెల్లించాల్సి రానుంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఏటా కనీసం 750 కోట్ల యూనిట్లను కొనుగోలు చేయాల్సిందే. ఈ లెక్కన ప్రతి యూనిట్‌పై రూపాయి చొప్పున 750 కోట్ల యూనిట్లపై ఏటా రూ.750 కోట్ల నుంచి రూ.1000 అదనపు వ్యయం కానుంది.

12 ఏళ్ల ఒప్పంద కాలంలో కనీసం రూ. 10 వేల కోట్ల భారం పడనుందని అంచనా. ఒక్కసారిగా ధరను ఛత్తీస్‌గఢ్ పెంచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ధరపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ సుంకం, ఇతరత్రా పన్నులు, వ్యయభారాలను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రమే భరించాలని తేల్చి చెప్పారు. దీనిపై వెంటనే నిర్ణయాన్ని తెలపని ఛత్తీస్‌గఢ్ అధికారులు... మళ్లీ సమావేశానికి వస్తామని చెప్పి వెనుతిరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని వదులుకుంటేనే రాష్ట్రానికి మేలని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వార్దా-మహేశ్వరం మధ్య నిర్మిస్తున్న విద్యుత్ లైన్ల నిర్మాణం పూర్తైనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి రానుంది.

>
మరిన్ని వార్తలు