1.2 లక్షల ఉద్యోగుల ఆందోళన బాట!

28 Aug, 2017 03:02 IST|Sakshi
1.2 లక్షల ఉద్యోగుల ఆందోళన బాట!
- కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దుకోసం డిమాండ్‌
నేటి నుంచి వరుసగా నిరసనలు, ఆందోళనలు
పాల్గొననున్న అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను (సీపీఎస్‌) రద్దు చేయాలని, పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిపి దాదాపు 1.2 లక్షల ఉద్యోగులతో పోరుబాటకు సిద్ధం అయ్యాయి. నేటినుంచి సెప్టెంబర్‌ 1వ తేదీవరకు వరుసగా ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించాయి. టీజీవో, టీఎన్‌జీవో, టీటీజేఏసీ, టీఈజేఏసీ వంటి సంఘాలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించగా, జాక్టో, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యక్రమాలతోపాటు సెప్టెంబర్‌ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించాయి.

అంతేకాదు ఆ రోజున ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సామూహిక క్యాజువల్‌ లీవ్‌ పెట్టాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తరువాత వారి భరోసా, భద్రతకు విఘాతంగా ఉన్న సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం అమల్లోకి తేవాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆందోళనకు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా ఉద్యమ రూపంలో సీసీఎస్‌ రద్దుకోసం పోరాటం చేసేందుకు సిద్ధం అయ్యాయి. ఈనెల 28న నిరసన ప్రదర్శనలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని జాక్టో ఆందోళనకు సిద్ధమైంది. ఈనెల 29వ తేదీన టీఎన్‌జీవో హైదరాబాద్‌ జిల్లాలో సభను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది.

అలాగే 30, 31 తేదీల్లో అన్ని డివిజన్‌ కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద, డివిజన్‌ కేంద్రాల్లో భోజన విరామ సమయాలలో ధర్నాలు నిర్వహించాలని టీజీవో, టీఎన్‌జీవో సంఘాలు నిర్ణయించాయి. వీటితోపాటు ఇతర ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో కూడిన తెలంగాణ ఎంప్లాయిస్‌ జేఏసీ (టీఈజేఏసీ), ఈనెల 30వ తేదీన మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని, సెప్టెంబర్‌ 1న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవల తీర్మానించాయి.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఇప్పటికే విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. మరోవైపు సెప్టెంబర్‌ 1వ తేదీన మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులంతా మండల విద్యాధికారి కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీటీజేఏసీ నిర్ణయించగా, అదే రోజు పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ టీచర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని, జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తీర్మానించింది.  
>
మరిన్ని వార్తలు