పుష్కరాలకు 1,460 మంది వైద్య సిబ్బంది

11 Aug, 2016 02:26 IST|Sakshi

రూ. 1.75 కోట్లు విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే జనానికి అవసరమైన వైద్యసేవలు అందించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అన్ని ఘాట్లలోనూ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. రెండు జిల్లాల్లో 1,460 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని వైద్యసేవలకు నియమించినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 52 ఘాట్‌లకు గాను  52 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 122 మంది వైద్య అధికారులు, 518 పారామెడికల్ సిబ్బందిని నియమించారు. అలాగే 38 వాహనాలను అందుబాటులో ఉంచుతారు. అందులో 104 సర్వీసు వాహనాలు 26 సిద్ధంగా ఉంటాయి.

ఇక నల్లగొండ జిల్లాలో 29 ఘాట్‌లకు గాను మొత్తం 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్కడ వైద్య సేవలు అందించేందుకు 145 మంది వైద్య అధికారులు, 675 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారు. 63 వాహనాలను సిద్ధంగా ఉంచుతారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏమైనా వైద్య సాయం అవసరమైతే ప్రాథమిక వైద్య సేవలు ఈ శిబిరాల్లో అందజేస్తారు. ఎమర్జెన్సీ అయితే సిద్ధంగా ఉంచిన వాహనాల్లో వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తారు. పుష్కరాల్లో వైద్య ఏర్పాట్ల కోసం రూ. 1.75 కోట్లు ఆయా జిల్లాలకు అందజేశామని ఆయన తెలిపారు. మరో రూ. 2 కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాలు నడుస్తాయని తివారీ వివరించారు.
 

మరిన్ని వార్తలు