1.56 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు

11 Apr, 2017 01:34 IST|Sakshi

ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రబీ సీజన్‌లో వేసిన పంటలు నీరందక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా బోరు బావుల కింద వేసిన పంటలే అధికంగా ఎండినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసిన ఆ శాఖ సోమవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ ప్రకారం మొత్తం 1.56 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అందులో 1.52 లక్షల ఎకరాల్లో వరి ఎండింది. అలాగే 4,130 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది. 17 జిల్లాలకు చెందిన 197 మండలాల్లో పంటలు ఎండిపోయినట్లు నివేదిక తెలిపింది. అత్యధికంగా మెదక్‌ జిల్లాలోని 20 మండలాల్లో 33,620 ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో 28,572 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 28 వేల ఎకరాల వరి పంట ఎండిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు.

బోరు బావుల కిందే 1.46 లక్షల ఎకరాలు...: జిల్లాల్లోని 197 మండలాల్లో 26.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో 18.54 లక్షల ఎకరాల్లో బోరు బావుల కింద సాగయ్యాయి. మిగిలినవి చెరువులు, కాలువలు, ఎత్తిపోతల కింద సాగయ్యాయి.అన్ని పంటలు కలిపి 1.56 లక్షల ఎకరాల్లో ఎండిపోగా, అందులో 1.46 లక్షల ఎకరాలు బోరు బావుల కిందే ఎండిపోవడం గమనార్హం. బోరు బావుల్లో నీరు అడుగంటిపోవడమే కారణమని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు