మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 1,638 నియామకాలు

29 Jan, 2017 00:22 IST|Sakshi
మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 1,638 నియామకాలు

వెంటనే పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: మైనారిటీ విద్యా సంస్థల్లో భారీగా నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1,638 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. వీటితోపాటు కొత్తగా 4,829 పోస్టులను మంజూరీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించటంతోపాటు కొత్త పోస్టులను రాబోయే మూడేళ్లలో మంజూరు చేసే ప్రణాళికను ఉత్తర్వుల్లో పొందుపరిచింది. మైనారిటీ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో ప్రస్తుతం 1,638 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 118 ప్రిన్సిపల్, 287 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్, 866 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్, 124 పీఈటీ, 125 ఆర్ట్‌/క్రాఫ్ట్‌/మ్యూజిక్‌ టీచర్, 125 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులున్నాయి.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిన ఈ ఖాళీలు భర్తీ చేయాలని, సంబంధిత విభాగం అందించే లోకల్‌ కేడర్, రోస్టర్‌ పద్ధతి, అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌) పంపిన ఖాళీల ప్రతిపాదనలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.

4,829 కొత్త పోస్టులకు ఆమోదం...
మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు కొత్తగా 4,829 బోధన, బోధనేతర పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 4,137 రెగ్యులర్‌ పోస్టులు, 692 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాబోయే మూడేళ్ల వ్యవధిలో విడతల వారీగా ఈ పోస్టులు మంజూరవుతాయి. ఈ ఏడాది 1,640 పోస్టులు, 2018–19లో 1,494 పోస్టులు, 2019–20లో 1,695 పోస్టులను మంజూరు చేయనుంది.

>
మరిన్ని వార్తలు