1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక

10 Jul, 2016 04:23 IST|Sakshi
1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక

- ప్రాజెక్టుల పూర్తికి అవసరమని ప్రభుత్వం అంచనా
- నీటిపారుదల, మైనింగ్‌శాఖలతో హరీశ్, కేటీఆర్‌ల సమీక్ష
- యుద్ధప్రాతిపదికన ఇసుక రీచ్‌లను గుర్తించాలని ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఇసుక రీచ్‌లను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, పరిశ్రమలు, మైనింగ్‌శాఖల మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజె క్టులతోపాటు ప్రతిపాదిత ప్రాజెక్టులకు ప్యాకేజీలవారీగా ఇసుక అవసరాలపై నీటిపారుదల, మైనింగ్‌శాఖల అధికారులతో హరీశ్, కేటీఆర్‌లు శనివారం సచివాలయంలో సంయుక్తంగా సమీక్షించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి 1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అంచనా వేశారు.

ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగ మొదలుకుని కరీంనగర్ జిల్లా గౌరవల్లి, గండిపల్లి, వరంగల్ జిల్లా దేవాదుల, నల్లగొండ జిల్లా ఎఎంఆర్ ప్రాజెక్టు, పెండ్లిపాకల, ఉదయసముద్రం, డిండి తదితర ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక పరిమాణంపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు. ప్రాజెక్టులకు సమీపంలోనే ఇసుక రీచ్‌లను గుర్తించాలని.. ఇసుక రీచ్‌లకు సంబంధించి జిల్లాలవారీగా రెండు రోజుల్లో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులో ఈ ఏడాది మూడు టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉన్నందున.. ప్రాజెక్టులోని ఇసుకను తరలించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 9వ ప్యాకేజీ, రంగనాయకి సాగర్, అనంతగిరి ప్రాజెక్టులకు అవసరమైన 7 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను 45 రోజుల్లో తరలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇసుక తరలింపులో అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్, కేటీఆర్‌లు ఆదేశించారు.

ఇసుక రీచ్‌ల నుంచి ప్రాజెక్టు వద్దకు ఇసుకను రవాణా చేసే ట్రక్కులు, ఇతర వాహనాలకు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసు, రెవెన్యూ అధికార యంత్రాంగం సహకారాన్ని తీసుకోవాలన్నారు. మైనింగ్ మంత్రిగా హరీశ్‌రావు చేపట్టిన చర్యలతో మైనింగ్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగిందని కేటీఆర్ ప్రశంసించారు. మైనింగ్ ఆదాయాన్ని ఈ ఏడాది రెట్టింపు చేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామన్నారు.
 
 భూసేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి...
ఇంజనీరింగ్ ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై హరీశ్‌రావు ప్యాకేజీలవారీగా సమీక్షించారు. భూసేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, భూసేకరణ సమస్యలను అధిగమించేందుకు రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. పనితీరు సరిగాలేని కిందిస్థాయి సిబ్బంది, ఇంజనీర్లను మార్చుకుని తమ బృందంలో సమర్థులను ఎంపిక చేసుకునే వెసులుబాటును చీఫ్ ఇంజనీర్లకు ఇస్తున్నామన్నారు. ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి అన్ని అంశాలపై సీఈలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమావేశంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, కార్యదర్శి వికాస్‌రాజ్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్‌ఎండీసీ ఎండీ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు