లగ్జరీ.. జూబ్లీహిల్సే మరి..

9 Jan, 2018 03:13 IST|Sakshi

  హై ఎండ్‌ షోరూమ్‌లు, ప్రముఖుల ఇళ్లకు కేరాఫ్‌ ప్రాంతం 

     ‘గ్రేటర్‌’లో లగ్జరీకి సింబల్‌గా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 36 

     100 వరకు బహుళ జాతి కంపెనీల స్టోర్లు, మాల్‌లు 

      అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సర్వేలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: లగ్జరీ నివాసాలు... హై ఎండ్‌ షోరూమ్‌లు... నిత్యావసర సరుకులు.. గృహోప కరణ వస్తువులు.. బ్రాండెడ్‌ దుస్తులు... వాహనాలు... గుండు సూది నుంచి బెంజ్‌ కార్ల వరకు సంపన్నుల చిరునామాగా నిలుస్తోందీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌. ఇందులోనూ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36 దేశంలోనే లగ్జరీకి సింబల్‌గా నిలుస్తోంది. దేశంలోని మెట్రో నగరాల్లో హైఫై ప్రాంతాలను గుర్తించేందుకు అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ తాజాగా ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఇందులో ముంబైలోని పోవాయ్, బ్రీచ్‌ క్యాండీ ప్రాంతాలు తొలిస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఢిల్లీలోని మెహర్‌చంద్‌ మార్కెట్‌.. రెండో, బెంగళూరులోని ఇందిరానగర్‌.. మూడో, గుర్గావ్‌లోని గలేరియా మార్కెట్‌.. నాల్గో స్థానంతోపాటు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36 ఐదో స్థానంలో నిలిచింది.
 
చాలా రిచ్‌ ఏరియా.. 
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36 ప్రాంతం సుమారు 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సుమారు 5,000 లగ్జరీ నివాసాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా సుమారు వందకుపైగా హై ఎండ్‌ రిటైల్‌స్టోర్లు, షోరూమ్‌లు, మాల్‌లు, పబ్‌లు, స్టోర్లున్నాయి. వీటిలో దుస్తులు, ఫ్యాషన్‌ వస్త్రాలు, నిత్యావసరాలు, కాఫీ షాప్‌లు, షూజ్, వాచెస్, డైమండ్స్, ఆభరణాలు, బెంజ్‌కార్లు, ర్యాప్టర్‌ వంటి విదేశీ బైక్‌ షోరూమ్‌లు సహా దేశంలో అన్ని రకాల లిక్కర్, వైన్, రమ్, జిన్‌ తదితర బ్రాండ్లు ఇక్కడ లభిస్తాయి. అలాగే విదేశీ మద్యం సైతం లభ్యమయ్యే అతిపెద్దదైన టానిక్‌ లిక్కర్‌మాల్, అతిపెద్ద జూబ్లీ 800 పబ్‌ సైతం ఇక్కడే ఉండడం విశేషం. ఈ ప్రాంతంలో ఇండిపెండెంట్‌ ఇళ్లు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.25 కోట్లు వెచ్చించాల్సిందేనని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ అద్దె నెలవారీగా రూ.లక్షకు పైమాటే. వాణిజ్య స్థలాలకు కూడా నెలకు రూ.లక్షల్లో చెల్లించాల్సిందే. ఇక ఈ ప్రాంతంలో చదరపు గజం స్థలం కొనుగోలు చేయాలంటే రూ.2 లక్షలు వెచ్చిం చక తప్పదు. హైపర్‌ మార్కెట్లు, జాయింట్‌ హైపర్‌ మార్కెట్లు, ఫ్యాషన్‌ స్టోర్లు, బోటిక్స్‌కు ఈ ప్రాంతం నిలయంగా మారినట్లు సర్వే వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు సహా ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పని చేస్తున్న సీఈఓలు, ఉన్నతోద్యోగులు, బడా కాంట్రాక్టర్లు, బహుళ జాతి కంపెనీల సీఈఓలు సైతం ఇక్కడ తమ శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో హైఎండ్‌ రిటైల్‌ మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తోందని అనరాక్‌ రియల్టీ సంస్థ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరిన్ని వార్తలు