హార్టికల్చర్‌ వర్సిటీలో 107 పోస్టులు

7 May, 2017 00:48 IST|Sakshi

- 85 బోధన,22 బోధనేతర పోస్టులు
- డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా నియామకం


సాక్షి, హైదరాబాద్‌: కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ)లో 107 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా వర్సిటీలో 72 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ గతేడాది జూన్‌ 18న ప్రభుత్వం ఉత్తర్వులను (జీవో78) జారీ చేసింది. అనంతరం పోస్టుల సంఖ్యను 107కు పెంచాలని, వర్సిటీ నిబంధన ప్రకారం డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా ఈ పోస్టుల భర్తీకి అనుమతించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో గతంలో జారీ చేసిన జీవో 78ను ఉపసంహరించుకున్న ప్రభుత్వం, వర్సిటీ విజ్ఞప్తి మేరకు 107 పోస్టులను డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా భర్తీకి అనుమతిచ్చింది. శనివారం ఈ మేరకు పరిపాలన పరమైన అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ ఉత్తర్వులు (జీవో 75) జారీ చేశారు. రిజర్వేషన్ల నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, సర్వీసు నిబంధనలను అనుసరిస్తూ పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని వర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించారు.

మరిన్ని వార్తలు