భూ రికార్డుల బూమ్‌.. బూమ్‌..!

9 Jan, 2018 01:59 IST|Sakshi

ప్రక్షాళన తర్వాత పెరిగిన భూమి 11 లక్షల ఎకరాలు

2.3 లక్షల సర్వే నంబర్లు, 6.9 లక్షల ఖాతాలు కూడా..

గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం భూమి సుమారు 2.52 కోట్ల ఎకరాలు

 25 నాటికి ప్రక్షాళన పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న భూముల వివరాలు, రికార్డుల వివరాల్లో భారీ ఎత్తునే మార్పులు జరగనున్నాయి. ఇప్పటికి పూర్తయిన భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలను పరిశీలిస్తే భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఖాతాల వివరాల్లో లక్షల సంఖ్యలో మార్పులొచ్చాయి. రాష్ట్రంలో గతంలో అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం 2.4 కోట్లకు పైగా ఎకరాలుండగా, ఇప్పుడు అది 2.51 కోట్లకు చేరింది. అదేవిధంగా 2.3 లక్షల సర్వే నంబర్లు, 6.9 లక్షల మంది రైతుల ఖాతాలు కూడా పెరగడం గమనార్హం.  

నల్లగొండలో అత్యధిక భూములు 
రాష్ట్రంలోని 30 జిల్లాల్లో నల్లగొండ జిల్లాలో ఎక్కువ భూములున్నట్టు తేలింది. ఈ జిల్లాలో 18,66,481 ఎకరాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆ తర్వాత పాలమూరు జిల్లాలో 13.50 లక్షల ఎకరాలు ఉంది. టాప్‌–2లో ఉన్న ఈ రెండు జిల్లాల మధ్య వ్యత్యాసమే 5 లక్షల ఎకరాలు దాటడం విశేషం. ఈ రెండు జిల్లాలకు తోడు మరో 8 జిల్లాల్లో 10 లక్షలకు పైగా ఎకరాల భూమి తేలింది. అయిదు లక్షల కన్నా తక్కువ భూములన్న జిల్లాలు కూడా నమోదయ్యాయి. మొత్తం 5 జిల్లాలో అత్యల్పంగా మేడ్చల్‌–మల్కాజ్‌గిరిలో 2,63,582 ఎకరాలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో ఇంకా రికార్డుల పరిశీలన పూర్తికాలేదు.

ఆ తర్వాత వరంగల్‌ అర్బన్లో తక్కువగా 3,17,500 ఎకరాలు నమోదయ్యాయి. అయితే, మొత్తం 10,874 రెవెన్యూ గ్రామాల్లోని 10,774 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరగ్గా.. అందులో 50–100 గ్రామాలు మినహా అన్నిచోట్లా రికార్డుల పరిశీలన పూర్తయిం దని రెవెన్యూ వర్గాలంటున్నాయి. మిగతా గ్రామాల్లో కూడా ఈ నెల 25 కల్లా  ప్రక్షాళన కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు