ఎవరి పంథా వారిది..!

3 Apr, 2016 14:24 IST|Sakshi
రామోజీరావు, ప్రియాంక

నగరవాసుల పుట్టిముంచుతున్న సైబర్ నేరగాళ్లు 
మూడు ముఠాలకు చెందిన 11మంది అరెస్టు 
రూ.5 లక్షలు స్వాధీనం, రూ.46.47 లక్షలు ఫ్రీజ్

ఆన్‌లైన్ ఆధారంగా వలవేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు తమ పంథాలను మార్చుకుంటూ నగరవాసులను ముంచేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఒక గ్యాంగ్... క్రెడిట్ కార్డ్స్ అప్‌గ్రేడ్ అంటే మరో ముఠా, ఇన్య్సూరెన్స్ బోనస్ పేరుతో మరో గ్యాంగ్...  నగరవాసుల నుంచి రూ.25.3 లక్షలు కాజేశారు. ఆయా ముఠాలకు చెందిన 11 మందిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు జాయింట్ కమిషనర్ (క్రైం) డాక్టర్ టి.ప్రభాకరరావు తెలిపారు. శనివారం సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. ఆయా నిందితుల నుంచి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.46.47 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. -సాక్షి, సిటీబ్యూరో

బంధువులే..ముఠాగా
ఆగ్రాకు చెందిన తరుణ్ గుప్తా విశాఖపట్నంలో పని చేస్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన రామోజీరావు బంధువు ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వారు ముగ్గురూ కలిసి మేకిన్ ఇండియా ప్రొగ్రామ్‌ను ఆసరాగా చేసుకుని ‘స్కిల్ డెవలప్‌మెంట్ మానిటరింగ్ (ఎస్‌డీఎమ్) సర్వీసెస్’ పేరు తో ఓ వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. దీని హోమ్ పేజ్‌లో దేశంలోని రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించినట్లు చూపించారు. ప్రతి జోన్‌లోనూ వివిధ రకాలైన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఆసక్తి ఉన్న కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఎర వేశారు. దీనిపై స్పందించిన పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రస్తుతం తాము చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి విలువల్నీ చూపిస్తూ ఈ-మెయిల్స్ చేశాయి. వీటికి సమాధానం ఇచ్చిన సైబర్ నేరగాళ్లు తాము సూచించిన ప్రాజెక్టుల విలువలో ఒక శాతం ఈఎండీ (ఎర్న్ మనీ డిపాజిట్) చెల్లించాలంటూ సమాధానం ఇచ్చారు.

టెండర్ ప్రక్రియలో పాల్గొన్న తర్వాత ప్రాజెక్టు రాకుంటే ఈఎండీ తిరిగి ఇచ్చేస్తామని, ఇందు కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు సైతం ఉన్నాయంటూ ఈ-మెయిల్ చేశారు. దీంతో అనేక కంపెనీలు సైబర్ నేరగాళ్లు సూచించినట్లే ఈఎండీలు చెల్లించారు. అయితే ‘సర్వీసెస్’ సంస్థ చెప్పినట్లు టెండర్లు ఓపెన్ చేసే తేదీ నాడు వీరెవ్వరికీ ఎలాంటి ఈ-మెయిల్ సమాచారం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయా కంపెనీలు ఆరా తీయగా..అసలు మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో నగరానికి చెందిన రెండు కంపెనీలు తమను ఎస్‌డీఎం సర్వీసెస్ నిర్వాహకులు రూ.16.2 లక్షలు మోసం చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ ఆగ్రాలో ఉంటున్న ప్రియాంక గుప్త, రామోజీరావులను అరెస్టు చేశారు. వీరు దేశ వ్యాప్తంగా రూ.83 లక్షల మేర వసూలు చేసినట్లు గుర్తిం చారు. తరుణ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు గుర్తించిన అధికారులు పీటీ వారెంట్‌పై తేవాలని నిర్ణయించారు.

‘లాప్స్ పాలసీ’ల పేరుతో లూటీ...
లాప్స్ అయిన ఇన్సూరెన్స్ పాలసీపై భారీ మొత్తం ఇస్తామని ఎరవేసిన ఉత్తరాది గ్యాంగ్ నగరానికి చెందిన వృద్ధుడు టి.మల్లయ్య నుంచి రూ.8.3 లక్షలు కాజేసింది. న్యూఢిల్లీకి చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు సూత్రధారులుగా ఓ ముఠా ఏర్పాటు చేశారు. షాన్ మహ్మద్, మనీష్‌కుమార్, వరుణ్‌యాదవ్, విపుల్‌సోని, అశోక్ యాదవ్ సహా మరికొందరు టెలీకాలర్స్‌ను ఏర్పాటు చేసుకుని, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వాటి కస్టమర్స్ డేటాను సంపాదించారు. ఆయా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పాలసీలు కట్టి, మధ్యలో మానేసిన ‘లాప్స్ పాలసీదారులను’ టార్గెట్‌గా చేసుకున్నారు.

వారికి ఫోన్లు చేసే టెలీకాలర్స్ లాప్స్ అయిన పాలసీ వివరాలు చెప్తూ నమ్మకం కలిగిస్తారు. బీమా మెచ్యూరిటీ మొత్తాన్ని ఇప్పిస్తామంటూ చెప్పి వల వేస్తారు. ఆకర్షితులైన వారికి దాని నిమిత్తం తమ సంస్థల్లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని షరతు విధిస్తారు. ఈ రకంగా మల్లయ్య నుంచి రూ.8.3 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి నుంచి డబ్బును బోగస్ పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు టెలీకాలర్లుగా వ్యవహరించి షాన్ మహ్మద్, మనీష్‌కుమార్, వరుణ్‌యాదవ్, విపుల్‌సోని, అశోక్ యాదవ్‌లను అరెస్టు చే సి, పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు.

రివార్డ్స్ పేరుతో ‘అసలుకే’ మోసం...
రివార్డ్ పాయింట్స్ పేరుతో క్రెడిట్‌కార్డ్స్ వినియోగదారుల నుంచి డేటాను సంగ్రహిస్తూ టోకరా వేస్తున్న ఢిల్లీ గ్యాంగ్ గుట్టరట్టైంది. ప్రమోద్ కుమార్ కేసరి, దినేష్ లక్రా, హరీష్ భాద్రీ, మనోజ్‌కుమార్ భైన్వాల్ న్యూ ఢిల్లీ కేంద్రంగా ముఠాగా ఏర్పడ్డారు. వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్‌కార్డ్ వినియోగదారుల డేటాను సంగ్రహించే ఈ ముఠా బ్యాంకు పేరుతో వారికి ఫోన్లు చేసి, ప్రత్యేక రివార్డ్ పాయింట్లను జమ చేస్తామంటూ కార్డ్ నెంబర్ నుంచి సీవీవీ కోడ్ వరకు సంగ్రహిస్తుంది. అనేక సందర్భాల్లో బాధితుల నుంచి వన్ టైమ్ పాస్‌వర్డ్స్‌నూ సంగ్రహించింది. వీటిని వినియోగించి కొనుగోళ్లు చేయడానికి ‘ఈ షాప్‌ట్రిక్స్. కామ్’వెబ్‌సైట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ-షాప్ ట్రిక్స్ వెబ్‌సైట్ నిర్వాహకులైన మనోజ్, హర్షిత్‌లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

వినియోగదారుల నుంచి సేకరించిన కార్డ్ డేటాతో ఈ వెబ్‌సైట్‌లో కనిష్టంగా రూ.7 వేలకు ఓ ప్యాక్‌ను ఖరీదు చేస్తారు. నాసిరకం షూస్, కళ్లజోడు, పర్సులతో కూడిన ఈ ప్యాక్‌ను వినియోదారుడికే పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా సదరు వినియోగదారుడే తన కార్డుతో ఖరీదు చేసినట్లు బుకాయించే అవకాశం ఉంటుంది. వినియోగదారుడి కార్డు నుంచి స్వాహా చేసిన మొత్తంలో ఈ ప్యాక్ ఖరీదు పోను మిగిలిన దాంట్లో 65 శాతం వెబ్‌సైట్ నిర్వాహకులు, 35 శాతం కాల్‌సెంటర్ నిర్వాహకులు పంచుకునేవారు. నగరానికి చెందిన వ్యక్తులు వీరి భారిన పడి రూ.80 వేలు నష్టపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ వీపీ తివారీ దినేష్, ప్రమోద్, మనోజ్, హర్షిత్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు