పదమూడేళ్ల ప్రజా ప్రస్థానం

9 Apr, 2016 21:03 IST|Sakshi
పదమూడేళ్ల ప్రజా ప్రస్థానం

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో సాహసోపేతమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టి శనివారం నాటికి సరిగ్గా పదమూడేళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరవు, కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు... నిరాశ, నిస్పృహలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు... తమను ఆదుకునే వారేరని ప్రజలు ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న సాహసోపేతమైన పాదయాత్రకు నడుం బిగించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు.

నడి వేసవిలో 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 68 రోజుల పాటు 11 జిల్లాల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనా వెంటనే కోలుకుని పాదయాత్రను కొనసాగించారు. ముఖ్యమంత్రి అయ్యాక  రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు, జలయజ్ఞం, రాజీవ్ ఉద్యోగశ్రీ తదితర పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

మరిన్ని వార్తలు