బాల్య వివాహం.. అది చాలక లీగల్ నోటీసు

12 Jan, 2017 15:06 IST|Sakshi
బాల్య వివాహం.. అది చాలక లీగల్ నోటీసు
తన వయసు కంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతడి వద్ద నుంచి తిరిగి వచ్చేసిన 16 ఏళ్ల బాలికకు ఆమె 'వైవాహిక విధులను' గుర్తుచేస్తూ లీగల్ నోటీసు పంపారు. ఈ ఘటన సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే జరిగింది. బాల్యవివాహం దానంతట అదే చట్టవిరుద్ధం కాదని, అందువల్ల ఫిర్యాదు ఇస్తే తప్ప తాము చర్యలేవీ తీసుకోలేమని పోలీసులు అంటున్నారు. దాంతో ఏంచేయాలో అర్థం కాని ఆ బాలిక.. సాయం కోసం బాలల హక్కుల కార్యకర్తలను ఆశ్రయించింది. ఆమె గత సంవత్సరం ఫిబ్రవరిలో పదో తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధం అవుతుండగా.. బలవంతంగా ఆమెకంటే 20 ఏళ్లు పెద్దవాడైన బంధువుకు ఇచ్చి పెళ్లి చేశారు. అత్త చనిపోతోందని, తన కొడుకు పెళ్లి చూడాలనుకుంటోందని.. అందువల్ల పెళ్లికి ఒప్పుకోవాలని చెప్పి ఒప్పించారు. 
 
ఆ పెళ్లంతా హడావుడిగా జరిగిపోయిందని, అతడికి 35 ఏళ్ల వయసున్న విషయం అప్పట్లో తనకు తెలియదని బాధిత బాలిక తెలిపింది. పెళ్లి తర్వాత కూడా తనను చదువుకోనివ్వాలని అప్పట్లో ఆమె షరతు విధించింది. పరీక్షల తర్వాత ఆమెను అత్తవారింటికి పంపారు. అక్కడ దాదాపు ప్రతిరోజూ శారీరకంగా, లైంగికంగా విపరీతంగా హింసించడం మొదలుపెట్టారు. పెళ్లయిన రెండు నెలల తర్వాత ఆ చిత్రహింసలు భరించలేక ఆమె ఇంటికి తిరిగొచ్చేసింది. కట్నంగా ఇచ్చిన లక్ష రూపాయలు, నగలు తిరిగి ఇచ్చేయాలని వియ్యంకులను అడగ్గా, వాళ్లు ఆమెకు లీగల్ నోటీసు పంపారు. అమ్మాయి తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడం కంటే, ఆడబ్బేదో లాయర్లకే ఇస్తామని అమ్మాయి భర్త అన్నాడు. ప్రస్తుతం జూనియర్ కాలేజీకి వెళ్లి చదువుకుంటున్న ఆ అమ్మాయి.. ఇక తిరిగి భర్త వద్దకు వెళ్లేది లేదని చెబుతోంది. తాను చదువుకుని, సొంత కాళ్ల మీద నిలబడతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. 
మరిన్ని వార్తలు