2,550 కొత్త పరిశ్రమలొచ్చాయ్!

2 Nov, 2016 00:47 IST|Sakshi
2,550 కొత్త పరిశ్రమలొచ్చాయ్!

- గత 9 నెలల్లో ప్రత్యక్షంగా 1.6 లక్షలు, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి
టీఎస్‌ఐపాస్‌తో రూ. 44,791 కోట్ల పెట్టుబడుల  రాక
- తెలంగాణ పారిశ్రామిక ప్రగతి వివరాలను వెల్లడించిన ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్‌ఐపాస్) అమల్లోకి వచ్చాక పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. గడచిన 9 నెలల్లో రాష్ట్రానికి 2,550 కొత్త పరిశ్రమలు రాగా, ఏకంగా రూ.44,791 కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఆయా పరిశ్రమల ద్వారా ఇప్పటికే ప్రత్యక్షంగా 1,60,894 మందికి, పరోక్షంగా  4.5 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజ నీరింగ్, ఆగ్రో బేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎల క్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్‌టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాలకు చెందినవి ఉన్నాయి.

గత 9 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ నివేదిక రూపొందించింది. ఏ జిల్లాలో ఎన్ని కోట్ల పెట్టుబడులొచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? ఎంత మందికి ఉద్యోగాలు కల్పించామనే వివరాలను అందులో పొందుపర్చింది. అధికంగా రంగారెడ్డి జిల్లాలో 68,622 మందికి ఉద్యోగాలు కల్పించారు. సంగారెడ్డి, మేడ్చల్, గద్వాల జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పరిశ్రమల విషయానికొస్తే కొత్తగా ఏర్పాటైన వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 169 ఫార్మా, కెమికల్స్, 87 పవర్, 165 ప్లాస్టిక్, రబ్బర్, 280 ఇంజనీరింగ్, 195 ఆగ్రో బేస్డ్, 46 ఎలక్ట్రికల్, ఎల క్ట్రానిక్స్, 166 గ్రానైట్ స్టోన్ క్రషింగ్, 69 పేపర్ ప్రింటింగ్, 63 టెక్స్‌టైల్, 117 సిమెంట్, 7 ఏరోస్పేస్, 820 ఇతర పరిశ్రమలున్నాయి.

మరిన్ని వార్తలు