ఐదేళ్లలో 2 కోట్ల మందికి ఉపాధి

9 Nov, 2013 04:36 IST|Sakshi

 హైదరాబాద్,న్యూస్‌లైన్: ప్రభుత్వ రంగ సంస్థలు తాము వినియోగించే విడిభాగాలు, పరికరాల్లో 20 శాతాన్ని తప్పనిసరిగా సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన వల్ల మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం కలిగిందని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎస్‌ఎంఈ రంగం 11శాతం వృద్ధి రేటు సాధిస్తుందని, 33వేలకోట్ల టర్నోవర్‌తో మరో 2కోట్ల మందికి ఉపాధి కల్పించే స్థాయికి విస్తరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ కుషాయిగూడలోని ఎన్‌ఎస్‌ఐసీ బిజినెస్‌పార్క్‌లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్/ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్’ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. కొనుగోలుదారులు, తయారీదారులను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రదర్శన నిర్వాహకులను ఆమె అభినందించారు. జాతీయ ఆదాయంలో 45 శాతం వాటా కలిగి, దాదాపు 7.30 కోట్ల మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తంచేశారు.

మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ ఉత్పాదక మండలి ప్రారంభమైతే అది తెలంగాణకు వరమవుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానంటూ... పరిశ్రమలశాఖకు తొలి మహిళా మంత్రిగా తాను సాధించిన విజ యాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా ‘ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో-2013’ సావనీర్‌ను విడుదల చేశారు. అనంతరంప్రదర్శనను ప్రారంభించి స్టాళ్లను తిలకించారు.

మరిన్ని వార్తలు