ఏపీ ఆర్థిక, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌గా అజేయ కల్లం

28 May, 2016 01:43 IST|Sakshi

భారీగా సీనియర్ ఐఏఎస్‌లకు స్థానచలనం
వెయిటింగ్‌లో ఉన్న ఏడుగురికి పోస్టింగ్
అటవీశాఖకు పీవీ రమేశ్

 
సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా ఐఏఎస్‌ల బదిలీలపై ఊరిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం 21 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లతో పాటు ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్‌లకు చెందిన ఏడుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు.

ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌పై ఏపీ సీఎం వేటు వేశారు. ఆయన్ను అడవుల బాట పట్టించారు. రమేశ్ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉండడంతో పాటు అదనంగా రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్ అంశాలకు సంబంధించి సీఎం ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు.

బదిలీల్లో ఏపీ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ ముద్ర ప్రస్ఫుటంగా కనిపించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజేయ కల్లంను నియమించాల్సిందిగా తొలి నుంచి టక్కర్ సీఎంకు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే అమలైంది. ఆర్థిక శాఖ, రెవెన్యూ(వాణిజ్య, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజేయ కల్లంను ప్రభుత్వం నియమించింది. దీర్ఘకాలంగా సాగునీటి శాఖ అధికారిగా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్‌ను బదిలీ చేశారు.

ఆయనను స్కూల్ విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. సాగునీటి శాఖ కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌ను నియమించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఏకే ఫరీడాను ప్రాధాన్యత లేని ప్రభుత్వ రంగ సంస్థల శాఖకు బదిలీ చేశారు. మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు ప్రస్తుతం ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖకు అదనంగా గృహ నిర్మాణ శాఖను కేటాయించారు. ఇటీవల పరిశ్రమల శాఖ నుంచి బదిలీ చేసిన రావత్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు.

మరిన్ని వార్తలు