217 మెట్రిక్ టన్నుల కాలం చెల్లిన సరుకులు

31 Mar, 2016 20:29 IST|Sakshi

- ప్రభుత్వానికి రూ.1.43 కోట్ల నష్టం
- ప్రభుత్వ పనితీరును తప్పుపట్టిన కాగ్


హైదరాబాద్ : దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) లబ్దిదారులకు 'అమ్మ హస్తం' పథకం ద్వారా సరఫరా చేసే సరుకులను కమిషన్లకు కక్కుర్తిపడి అవసరానికి మించి కొనుగోలు చేయడంతో వాటిలో చాలా వరకు మిగిలిపోయి  వాడుకోవడానికి వీలులేకుండా పనికి రాకుండా పోయాయి. అమ్మహస్తం పథకాన్ని 2013 ఏప్రిల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని 2014 ఆగస్టులో రద్దు చేశారు. అమ్మహస్తం పథకం ద్వారా కిలో కందిపప్పు, లీటర్ పామోలిన్, కిలో గోధుమ పిండి, కిలో గోధుమలు, అర కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం పొడి, అరకిలో చింతపండు, 100 గ్రాముల పసుపుతో కూడిన తొమ్మిది నిత్యావసర సరుకులను ప్రత్యేక సంచిలో ఉంచి పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.185లకే తెల్ల రేషన్ కార్డుదారులకు రాయితీపై అందించారు.

అయితే అవసరానికి మించి సరుకులను కొనుగోలు చేయడంతో 217.44 మెట్రిక్ టన్నుల కాలం చెల్లిన సరుకులను బహిరంగంగా విక్రయించడం వల్ల రూ. 1.43 కోట్ల మేర పౌరసరఫరాల సంస్థకు నష్టం వాటిల్లిందని కాగ్ గుర్తించి ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. అదేవిధంగా ఈ పథకం కోసం ప్రత్యేకించి రూపొందించిన రూ.11.74 లక్షల విలువైన సంచులు పంపిణీ చేయకుండా నిరుపయోగంగా ఉన్నట్లు కాగ్ గుర్తించింది. రాష్ట్రంలో ఉన్న 1.30 కోట్ల కుటుంబాలకు సరఫరా చేసేందుకు ప్రతి సరుకు ఎంత మొత్తంలో అవసరమౌతోంది.. అందుకు ప్రతిగా వాస్తవంలో (2013 మే- 2014 ఆగస్టు మధ్య కాలంలో) ఎంత విడుదల చేశారు అన్న అంశాన్ని ఆడిట్‌లో విశ్లేషించగా తొమ్మిదిలో ఆరు సరుకులను (కందిపప్పు, పామోలిన్, పంచదార మినహా) తగు మొత్తంలో సరఫరా చేయలేదని కాగ్ పరిశీలనలో వెల్లడైంది.

మరిన్ని వార్తలు