21వ శతాబ్దం భారత్-అమెరికాలదే

4 Jun, 2016 07:45 IST|Sakshi
21వ శతాబ్దం భారత్-అమెరికాలదే

ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ పెట్టుబడులకు తెలంగాణ, ఏపీ అనువైనవి: గవర్నర్

 సాక్షి, హైదరాబాద్: భారత్-అమెరికా కలసి ముందడుగు వేస్తే 21వ శతాబ్దంలో ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకుంటే ప్రపంచ వేదికపై నిర్మాణాత్మక పాత్ర పోషించవచ్చన్నారు. భారత్-అమెరికాల వ్యాపార సంబంధాలు 500 బిలియన్ డాలర్ల లక్ష్యంగా ఐఏసీసీ (ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్) చేసిన అధ్యయన పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన రెండు రోజుల ఐఏసీసీ-2016 జాతీయ సదస్సులో అంతర్జాతీయ కన్సల్టెన్సీ కేపీఎంజీ విడుదల చేసింది.

ఇందులో రాజ్‌నాథ్‌తో పాటు గవర్నర్ నరసింహన్, అమెరికా కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ పాల్గొన్నారు. ఈ సదస్సులో రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యం మరింత విస్తృతమవ్వాలని ఆకాంక్షించారు. గత 14 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమవుతున్నాయని.. 2009లో 90 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వర్తకం 2014 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఉదహరించారు. అయితే 2016 నుంచి సాధ్యమైనంత త్వరలో ఇది 500 బిలియన్ డాలర్లకు చేరాలని రాజ్‌నాథ్ ఆకాంక్షించారు. అందుకోసం ఐఏసీసీ తయారు చేసిన రోడ్‌మ్యాప్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉన్న అపార వనరులు మరెక్కడా లేవని...ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది కూడా మన దేశమేనన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గతంలో 21వ శతాబ్ది భారత్‌దేనంటూ చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం భారత్ రెండంకెల వృద్ధిరేటును సాధించేందుకు కేంద్రంలోని తమ ప్రభు త్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ విండో పద్ధతిని ప్రవేశపెట్టామన్న రాజ్‌నాథ్... ప్రస్తుతం మూడేళ్లకోసారి పరిశ్రమలు చేయించుకోవాల్సిన భద్రతపరమైన అనుమతుల రెన్యూవల్‌ను పదేళ్లకు పెంచుతున్నట్లు చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఏర్పాటులో అమెరికా తోడ్పాటు అందించాలని రాజ్‌నాథ్ కోరారు. పర్యావరణ అనుకూలమైన సౌర, పవన విద్యుత్ ద్వారా 175 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

లేజర్ కిరణాలతో దేశ సరిహద్దు...
దేశ సరిహద్దులు కచ్చితమైనవిగా ఉంటే అంతర్గత భద్రత బాగుంటుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అందుకోసం తమ ప్రభుత్వం దేశ సరిహద్దు వెంబడి లేజర్ కిరణాలతో ‘గోడ’ను నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ దేశంలో పెట్టుబడులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత అనువైనవని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులిచ్చేలా సింగిల్ విండో పద్ధతిని తీసుకొచ్చిందని వివరించారు.

మరిన్ని వార్తలు