క్రమబద్ధీకరణకు 22 వేల దరఖాస్తులు

10 Apr, 2017 03:02 IST|Sakshi
క్రమబద్ధీకరణకు 22 వేల దరఖాస్తులు

- 10 వేల దరఖాస్తులు సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లవే
- బిల్‌ కలెక్టర్ల నుంచీ దరఖాస్తుల స్వీకరణపై త్వరలో నిర్ణయం
- ఆ తర్వాతే మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు


సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులు, కార్మికుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. అందులో దాదాపు 10 వేలు సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లవే ఉన్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పరిధిలో అత్యధికంగా 10 వేల దరఖాస్తులు రాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) పరిధిలో మరో 5 వేలు, తెలంగాణ విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) పరిధిలో 4,200, రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) పరిధిలో 4,100 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఇంధన శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

దరఖాస్తుల్లోని సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 17 తర్వాతే దరఖాస్తుల సంఖ్య పట్ల స్పష్టత రానుందని అధికారవర్గాలు తెలిపాయి. విద్యుత్‌ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమలు కోసం విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు దరఖాస్తుల స్వీకరణ నిర్వహించాయి.

బిల్‌ కలెక్టర్లపై త్వరలో నిర్ణయం
ప్రైవేటు కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న బిల్‌ కలెక్టర్లు, అకౌంటింగ్‌ అసిస్టెం ట్లు, హమాలీల క్రమబద్ధీకరణ కోసం కూడా దరఖాస్తులు స్వీకరించే అంశంపై త్వరలో విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నాయి. పార్ట్‌టైం ఉద్యోగుల నుంచీ దరఖాస్తులు  స్వీకరించాలని విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్లు చేసిన డిమాండ్‌పై యాజమా న్యాలు పరిశీలన జరుపుతున్నాయి. పార్ట్‌టైం ఉద్యోగులకు భవిష్య నిధి (పీఎఫ్‌) సదుపాయం లేకపోవడం, నిబంధనల మేరకు 8 గంటలు పనిచేసే కార్మికుల పరిధిలోకి వీరు రాకపోవడంతో పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి తొలుత దరఖాస్తులు స్వీకరించలేదు.

ట్రేడ్‌ యూనియన్ల విజ్ఞప్తుల నేపథ్యంలో  సాధ్యాసా ధ్యాలను పరిశీలించి ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాలు భావిస్తున్నా యి. దీంతో పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి భవిష్యత్తులో న్యాయపర చిక్కులు ఎదురుకా వన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవు తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిస్కంల పరిధిలో దాదాపు 5 వేల మందికి పైగా బిల్‌ కలెక్టర్లు పార్ట్‌టైమ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు