వడదెబ్బ.. మృత్యుఘోష

27 Apr, 2016 04:08 IST|Sakshi
వడదెబ్బ.. మృత్యుఘోష

- వడదెబ్బకు ఇప్పటివరకు 243 మంది మృత్యువాత
- ప్రభుత్వానికి కలెక్టర్ల నివేదిక

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు! ఇప్పటివరకు(మంగళవారం నాటికి) 243 మంది చనిపోయారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి  నివేదించారు. వడగాడ్పులకు చిన్నాపెద్దా అల్లాడిపోతున్నారు. మండుటెండల్లో బస్సులు, ఆటోలు నడిపే డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మంగళవారం హైదరాబాద్‌లో ఉప్పుగూడకు చెందిన సురేశ్‌కుమార్ అనే ఆటో డ్రైవర్ తాను కూర్చున్న సీట్లోనే ప్రాణాలొదిలాడు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈయన సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డులోని కేఎఫ్‌సీ వద్దకు వచ్చాడు.
 
 దాహంగా ఉండడంతో ఆటో నిలిపి ఓ హోటల్‌కు వెళ్లి నీళ్లు తాగి మళ్లీ వచ్చాడు. ఉన్నట్టుండి సీట్లోనే వెనుకకు ఒరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు 108లో గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. సురేశ్ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు చెబుతుండగా.. వడదెబ్బ తగిలి ప్రా ణాలు కోల్పోయాడని తోటి డ్రైవర్లు పేర్కొంటున్నారు.
 
 గతేడాదికి ఇప్పటికి ఎంత తేడా..
 గత ఏడాది ఏప్రిల్‌లో వడగాడ్పులు ప్రారంభం కాకపోవడంతో ఆ నెలలో వడదెబ్బ మృతులు నమోదు కాలేదు. ఈసారి ఏప్రిల్ నాటికే వడదెబ్బకు 243  మంది మృత్యువాత పడడం గమనార్హం. ఈ వడదెబ్బ మృతులపై మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్సై, మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య నిజ నిర్ధారణ కమిటీ విచారణ జరిపింది. మొత్తం 243 మృతుల్లో 157 కేసులను విచారించి, వాటిల్లో 79 మంది వడదెబ్బతో చనిపోయినట్లు కమిటీ నిర్ధారించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. కలెక్టర్ల నివేదిక ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికంగా 95 మంది చనిపోయారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 38 మంది, మెదక్ జిల్లాలో 33 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 18 మంది చనిపోయారు. వడదెబ్బ మృతులను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 ఎక్స్‌గ్రేషియా భారాన్ని తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే,  ఇంతటి తీవ్ర పరిస్థితి ఉన్నా.. జనాన్ని ఆదుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక కరువైంది. విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాలకు, వివిధ శాఖాధిపతులకు ఈ ప్రణాళికను ఇప్పటికే పంపించింది. కానీ దీన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వడగాల్పుల నుంచి రక్షణకు ఏర్పాటైన కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ఒక్కపైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం.
 
 మరో రెండ్రోజులు వడగాడ్పులు
 తెలంగాణ వ్యాప్తంగా మరో రెండ్రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం రామగుండం,  నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్‌ల్లో అత్యధికంగా 44 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. భద్రాచలంలో 42.6, హన్మకొండలో 43.2, హైదరాబాద్‌లో 40.2, ఖమ్మంలో 42.6, మహబూబ్‌నగర్‌లో 43.2, మెదక్‌లో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సైదాబాద్, ఓల్డ్‌సిటీ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
 
 వడదెబ్బతో 77మంది మృతి
 సాక్షి, నెట్‌వర్క్:  మంగళవారం ఒక్కరోజే వడదెబ్బకు 77మంది బలయ్యారు. నల్లగొండ జిల్లాలో 17 మంది, వరంగల్ జిల్లాలో 17 మంది, ఖమ్మం జిల్లాలో 16 మంది, మెదక్ జిల్లాలో 8 మంది, కరీంనగర్ జిల్లాలో ఏడుగురు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్ జిల్లాలో నలుగురు, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు వడదెబ్బతో మృతి చెందారు.

మరిన్ని వార్తలు