25 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

17 Aug, 2016 01:12 IST|Sakshi
25 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

* నగరంలోని 77 ప్రాంతాల్లో నిర్మాణ ప్రక్రియ
* మంత్రి కేటీఆర్ వెల్లడి

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో ఎంపిక చేసిన 77 ప్రదేశాల్లో 25 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టనున్నట్లు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు.  డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో  ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ... ‘77 ప్రదేశాల్లోని స్థానికులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ బస్తీల్లో ఇళ్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలుస్తాం. ఇవేకాక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి, జియో ట్యాగింగ్ చేసి దశలవారీగా అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. నగరంలోని 1,400 మురికివాడల్లోనూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఒక్కో ఇంటిని రూ.7లక్షలతో నిర్మించేందుకు జాతీయస్థాయిలో టెండర్లను ఆహ్వానిస్తాం. నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం’ అని చెప్పారు.   
 
గోకుల్ ఫ్లాట్స్ సమస్యలు పరిష్కరిస్తాం..
గోకుల్  సొసైటీలోని ఇళ్లను క్రమబద్ధీకరణకు, 57, 80 సర్వే నంబర్లలోని ఇళ్ల సమస్యల పరిష్కారానికి త్వరలోనే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మునిసిపల్, తదితర శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ... ప్రత్యేకంగా సమావేశమైన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. తనను కలసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో పాతబస్తీ సమస్యలపై చర్చించారు. నగరంలో వంద కిలోమీటర్ల మేర వైట్ టాపింగ్ రోడ్ల నిర్మా ణాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేస్తామన్నారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, అడిషనల్ కమిషనర్ సురేంద్రమోహన్, చీఫ్ ఇంజనీర్ సురేష్‌కుమార్, సీసీపీ దేవేందర్‌రెడ్డి, హౌసింగ్ ఎస్‌ఈ శివకుమార్ పాల్గొన్నారు.
 
గరిష్టంగా 9 అంతస్తుల్లో...

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను జీ ప్లస్ 9 అంతస్తుల వరకు పరిమితం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. అంతకుమించి అంతస్తులు నిర్మిస్తే నిర్వహణతోపాటు ఇతరత్రా సమస్యలు వస్తాయన్న అధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం వీలైనంత త్వరగా స్థలాల్ని జీహెచ్‌ఎంసీకి అప్పగించాల్సిందిగా కేటీఆర్ రెండు జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. అనర్హులు, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం ద్వారా గృహ సదుపాయం పొందిన వారికి తిరిగి ఇళ్లు కేటాయించేందుకు వీలు లేకుండా తగిన కంప్యూటర్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేటీఆర్ అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు