హైదరాబాద్‌లో భారీగా కరెన్సీ నోట్లు స్వాధీనం

10 Dec, 2016 17:44 IST|Sakshi
సైదాబాద్‌ పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న నగదు

హైదరాబాద్‌: బ్యాంకులకు వరుసగా సెలవులు రావడం, ఏటీఎంలలో డబ్బు లేక సామాన్యులు కష్టాలు పడుతుంటే.. మరోవైపు అక్రమ పద్ధతుల్లో నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న వారి నుంచి లక్షలాది రూపాయల నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

సైదాబాద్‌ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 29,76,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురు 15 శాతం కమీషన్‌ తీసుకుని కొత్త కరెన్సీ ఇచ్చి పాత నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను బింగి వాసు గౌడ్‌, బండారు వెంకటేష్‌, మోదుగుల మోహన్‌లుగా గుర్తించారు.

పోలీసులు మరో సంఘటనలో షాద్‌నగర్‌ సమీపంలో భారీగా కరెన్సీ పట్టుకున్నారు. 82 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 71 లక్షల రూపాయల కొత్త కరెన్సీ ఉంది. పోలీసులు ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.