ప్రమోషన్ల జాతర

29 Sep, 2016 02:06 IST|Sakshi
ప్రమోషన్ల జాతర

కొత్త జిల్లాల్లో 3,252 పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం
ప్రతి కేడర్‌లోనూ పెరగనున్న పోస్టులు
ఉద్యోగుల కేటాయింపు ప్రణాళికపై సీఎంవో సమీక్ష
జిల్లాల ఆవిర్భావం రోజు నుంచే కొత్త పాలన
పోలీస్, రెవెన్యూ విభాగాలు పనులు ప్రారంభించాలి
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
తుది నోటిఫికేషన్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ

 
సాక్షి, హైదరాబాద్:
కొత్త జిల్లాల్లో పని చేసేందుకు అదనపు ఉద్యోగులు కావాలని, మొత్తం 3,252 పోస్టులు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి వీటిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించిన ప్రభుత్వం ఉద్యోగుల కేటాయింపుల తుది ప్రణాళికపై మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఆవిర్భావం రోజు నుంచే కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.
 
ప్రభుత్వ సిబ్బందిని అందుకు సిద్ధంగా ఉంచాలని సీఎం కార్యాలయ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ కార్యాలయాలు మొదటి రోజు నుంచే పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో వివిధ శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, వసతి సదుపాయాలతోపాటు ఉద్యోగుల కేటాయింపు, అందుకు సంబంధించిన ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు.
 
తొలి రోజు నుంచే అన్ని కేంద్రాల్లో పరిపాలన ప్రారంభించేందుకు ప్రతిపాదనలు, ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు, రెవె న్యూ డివిజన్ కార్యాలయాలు, మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్లు తదితర కార్యాలయాల నిర్వహణకు సత్వరం ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా ఏర్పడే కేంద్రాల్లో ఎందరు ఉద్యోగులు అవసరం, ఎన్ని కేడర్ పోస్టులు అవసరం? వాటిని ఎలా భర్తీ చేయాలి? అన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అర్హతను బట్టి ఆయా శాఖల్లో పదోన్నతులు కల్పించి ఈ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కేడర్‌లోనూ పోస్టులు పెరగనున్నట్లు వెల్లడించారు.
 
 ఏం మార్పులుంటాయో..?

 కొత్త జిల్లాలకు సంబంధించి అర్జీల పరిశీలన కొనసాగుతుండటంతో ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 11న దసరా నుంచి కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలన్నీ మనుగడలోకి వస్తాయని ఇప్పటికే పలుమార్లు సీఎం స్పష్టం చేశారు. ముసాయిదా నోటిఫికేషన్‌పై వచ్చిన అభ్యంతరాలు, అర్జీల దృష్ట్యా కొత్త  జిల్లాలు, డివిజన్లు, మండలాలకు సంబంధించి స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.
 
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు పలుచోట్ల కొత్త జిల్లాల స్వరూపంతోపాటు డివిజన్లు, మండలాలకు మార్పులు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌లో పొందుపరచనుంది. దీంతో ముసాయిదా జారీ చేసిన తర్వాత తెర పైకి వచ్చిన మండలాలు, కొత్త డివిజన్లు ఉంటాయా? హన్మకొండ జిల్లా కేంద్ర స్వరూపం మారుతుందా? అనే సందిగ్ధత కొనసాగనుంది.
 
 న్యాయ చిక్కుల్లేకుండా
 దసరా ముహూర్తాన కొత్త కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం అధికారిక ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మొత్తం లక్షకుపైగా వినతులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలపై న్యాయపరమైన చిక్కులు సైతం ఎదురయ్యే అవకాశం లేకపోలేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తుది నోటిఫికేషన్ జారీ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ చిక్కులు అధిగమించేందుకు దసరా రోజునేనోటిఫికేషన్ జారీ చేసి, నిర్ణీత ముహూర్తానికి కొత్త జిల్లాలను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

మరిన్ని వార్తలు