రేబీస్‌తో చిన్నారి మృతి

16 May, 2016 21:04 IST|Sakshi

హైదరాబాద్:  నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం రేబీస్‌తో ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు.. కర్మన్‌ఘాట్‌లో నివాసముండే మిర్యాల శ్రీనివాసులు, మానస దంపతులు ఏకైక కుమార్తె ఉషశ్రీ(3)ను మూడు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. ఆ సమయంలో స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. రిగ్ ఇంజక్షన్ చేయించలేదు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని ఆదివారం చికిత్సల కోసం నీలోఫర్‌కు తీసుకు వెళ్లారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు చిన్నారికి రేబిస్ లక్షణాలు కనిపిస్తున్నాయని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆదివారం రాత్రి చిన్నారిని ఫీవర్ ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి చికిత్సలు ప్రారంభించారు. కాగా సోమవారం సాయంత్రం చిన్నారి మృతి చెందింది.

మరో బాలునికి రేబిస్
నిజామాబాద్ జిల్లా బీల్‌గల్ మండలం తాళ్లపల్లికి చెందిన రవి కుమారుడు గణేష్(9)ని రెండు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు బాలునికి రిగ్ ఇంజక్షన్ చేయించలేదు. కాగా రెండు రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తున్న బాలున్ని స్థానిక ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం రాత్రి బాలున్ని ఫీవర్ ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు రేబిస్‌గా నిర్ధారించి ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు ప్రారంభించారు. అయితే ఆ బాలుని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పిస్తామంటూ సోమవారం ఉదయం బాలున్ని తీసుకు వెళ్లారు.
 

>
మరిన్ని వార్తలు