300 కి.మీ. మేర రీజినల్ రింగ్‌రోడ్డు

24 Aug, 2016 03:01 IST|Sakshi
300 కి.మీ. మేర రీజినల్ రింగ్‌రోడ్డు

 రూ. 6 వేల కోట్లతో ‘ఔటర్’ వెలుపల నిర్మాణం
- జాతీయ రహదారిగా నిర్మాణానికి కేంద్రం అంగీకారం
 
 సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)... రూ. 6,696 కోట్ల వ్యయంతో 158 కిలోమీటర్ల మేర రూపుదిద్దుకున్న దేశంలోనే అతి పొడవైన తొలి ఎనిమిది వరుసల ఎక్స్‌ప్రెస్‌వే. తాజాగా దీని వెలుపల భారీ రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. దాదాపు 300 కిలోమీటర్ల మేర నాలుగు వరసలతో నిర్మితమయ్యే దీని నిర్మాణానికి రూ. 6 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించనున్న ఈ రోడ్డును కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల విభాగం నిర్మించనుండటం విశేషం. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో సిద్ధం చేసి కేంద్రానికి పంపనుంది. దాని ఆధారంగా జాతీయ రహదారుల విభాగం అధికారులు సర్వే చేపట్టి రోడ్డు డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

 ట్రాఫిక్ చిక్కులకు చెక్...
 హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుండటంతో ట్రాఫిక్ చిక్కులూ అంతే వేగంగా పెరుగుతున్నాయి. నగరం వెలుపల కూడా రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుండటంతో వాహనాల వేగం మందగిస్తోంది. దీనికి పరిష్కారంగా రీజినల్ రింగురోడ్డు నిర్మాణం కానుంది. పైగా ఇది జాతీయ రహదారి కానున్నందున జాతీయ రోడ్ కాంగ్రెస్ విధానాలతో రూపుదిద్దుకోనుంది. ప్రమాదాలను వీలైనంత తగ్గించేలా డిజైన్ ఉండనుండటంతోపాటు నగరం వెలుపల ఉన్న 12 పట్టణాలను అనుసంధానిస్తూనే వాహనాలు వేగంగా వెళ్లేలా రూపుదిద్దుకోనుంది. దీంతో ఔటర్ రింగురోడ్డు వరకు రావాల్సిన అవసరం లేకుండానే ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు రీజినల్ రింగురోడ్డు మీదుగా గమ్యం వైపు దూసుకుపోయే అవకాశం కలుగుతుంది.

 అనుసంధానమయ్యే ప్రాంతాలివే...
 నల్లగొండ జిల్లాలోని భువనగిరి-చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం-మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్-షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల-మెదక్ జిల్లా కంది-సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-జగదేవ్‌పూర్ నుంచి తిరిగి భువనగిరికి అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం జరగనుంది.

 నిర్మాణం, నిర్వహణ కేంద్రానిదే...
 ఔటర్ రింగురోడ్డు వెలుపల రీజినల్ రింగురోడ్డు అవశ్యకతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆ బాధ్యతను కేంద్రానికి అప్పగించాలని నిర్ణయించారు. దీనిపై వారం క్రితం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఫోన్‌లో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కిలోమీటర్‌కు దాదాపు రూ. 15 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మొదలు, భూసేకరణకు అవసరమయ్యే దాదాపు రూ. 1,500 కోట్ల ఖర్చు సహా భవిష్యత్తులో రోడ్డు నిర్వహణ వ్యయమంతా కేంద్రమే చూసుకోనుంది. ఈ అంశంపై రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ వినోద్ కుమార్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డి మంగళవారం ఢిల్లీలో గడ్కరీతో సమావేశమై చర్చించారు. వెంటనే ఆయన పచ్చజెండా ఊపటంతో తెలంగాణకు భారీ ప్రాజెక్టు మంజూరైనట్టయింది.
 
 మరో 650 కి.మీ. జాతీయ రహదారులకు కేంద్రం ఓకే
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మరో 650 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం చేసిన ప్రతిపాదన లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. మంత్రి తుమ్మల, ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం గడ్కరీతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఆయనకు వివరించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని తుమ్మల మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన హరిత రహదారుల పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి రూ. 1,153 కోట్లతో ప్రతిపాదనలు సమర్పిం చినట్టు తుమ్మల చెప్పారు. కేంద్ర రహదారుల నిధుల కింద రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయడానికి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా అదుకుంటుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు.
 
 ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలివే..
- సంగారెడ్డి-నరసాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగ్దేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్‌లను కలుపుతూ 140 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారిగా విస్తరణ.
- చౌటుప్పల్-ఇబ్రహీంపట్నం-ఆమన్‌గల్-షాద్‌నగర్- శంకర్‌పల్లి-కందీలను కలుపుతూ 160 కి.మీ, విస్తరణ.
- మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తిలను కలుపుతూ 130 కి.మీ.
హైదరాబాద్ ఓఆర్‌ఆర్-వలిగొండ- తొర్రూరు-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లందు- కొత్తగూడెంలను కలుపుతూ 220 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా విస్తరణ.

మరిన్ని వార్తలు