నిర్వాసితులకు రూ. 3,200 కోట్లు: దేవినేని

18 Jul, 2014 03:12 IST|Sakshi
నిర్వాసితులకు రూ. 3,200 కోట్లు: దేవినేని

సాక్షి, హైదరాబాద్: పోలవరం నిర్వాసితుల పునరావాస, పునర్నిర్మాణ పనులకు రూ. 3,200 కోట్లు కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ నిధులతో ముంపు బాధితులైన గిరిజనులకు మెరుగైన పునరావాసాన్ని కల్పిస్తామన్నారు.

జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరాన్ని 3 నుంచి నాలుగేళ్లలో పూర్తిచేసి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు 1.5 టీఎంసీల నీరిచ్చి ముంపు లేకుండా రక్షణ గోడలు నిర్మిస్తామన్నారు. వరద ప్రవాహం ప్రారంభమై ప్రస్తుతానికి ఆల్మట్టికి 39,359 క్యూసెక్కులు, తుంగభద్రకు 43,574 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉందని, కృష్ణాడెల్టాకు రావాల్సిన 2.8 టీఎంసీల నీటిని కచ్చితంగా విడుదల చేయిస్తామన్నారు.
 
ఈ మేరకు గురువారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలవరంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. పోలవరం గొప్ప ప్రాజెక్టని కాంగ్రెస్ నేత చిరంజీవి అంటుంటే, అది గొప్ప ప్రాజెక్టు కాదని.. అదే పార్టీకి చెందిన మరో నేత జానారెడ్డి అంటున్నారని దుయ్యబట్టారు. అన్ని విషయాల్లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు