3,500 కోట్ల పెట్టుబడులు

29 Jan, 2018 02:52 IST|Sakshi
ఆదివారం అబుదాబీలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలను ఇచ్చి పుచ్చుకుంటున్న బీఆర్‌ఎస్‌ ప్రతినిధి, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌

లూలు, బీఆర్‌ఎస్‌ కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూలు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు పెట్టనున్న లూలు గ్రూప్‌

ఔషధ పరికరాల ఉత్పత్తికి బీఆర్‌ఎస్‌ పెట్టుబడులు

అబుదాబీ, యూఏఈల్లో కేటీఆర్‌ బృందం పర్యటన

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రానికి మరో రెండు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు రానున్నాయి. రెండు వారాలుగా విదేశీ పర్యటనల్లో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బృందం ఆదివారం యూఏఈ, అబుదాబీల్లో పర్యటించింది.

రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం అక్కడి రెండు ప్రముఖ కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. అబుదాబీకి చెందిన లూలు గ్రూప్‌ కంపెనీ రూ.2,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుండగా, యూఏఈకి చెందిన బీఆర్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీ వచ్చే ఐదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ రెండు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

మంచి వ్యాపార అవకాశాలు: లూలు గ్రూప్‌
యూఏఈకి చెందిన లూలు గ్రూప్‌ కంపెనీ రూ.2,500 కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టనుంది. 18 లక్షల చదరపు అడుగుల స్థలంలో మెగా షాపింగ్‌ మాల్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. కూరగాయలు, పండ్ల ఎగుమతుల వ్యాపారం కోసం హైదరాబాద్‌ నగరంలో లాజిస్టిక్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను నెలకొల్పనుంది. పరిశ్రమల స్థాపనకు భూముల అప్పగింత ప్రక్రియను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని, మరో 3 నెలల్లో పరిశ్రమల స్థాపనకు చర్యలు ప్రారంభిస్తామని లూలు గ్రూప్‌ చైర్మన్‌ ఎంఏ యూసుఫ్‌ అలీ తెలిపారు.

భారత్‌లో వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఒప్పందం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మంచి వ్యాపార అవకాశాలను కలిగి ఉందని, బాగా సహకరిస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సంస్థల నుంచి పెట్టుబడులను ఆశిస్తున్నామని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న లూలు గ్రూప్‌ రాష్ట్రానికి రావడం అత్యుత్తమ అవకాశంగా భావిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్‌లో లూలు గ్రూపుతో కలసి మరిన్ని ప్రాజెక్టుల కోసం పని చేస్తామని పేర్కొన్నారు. లూలు గ్రూప్‌ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 6 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు చెప్పారు.


మరో ఔషధ పరిశ్రమ రాక
బీఆర్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీ రాష్ట్రంలో 20 ఎకరాల్లో ఔషధ ఉత్పత్తి పరిశ్రమతోపాటు ఔషధ పరిశోధనలు, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) రంగ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ముచ్చర్లలో నిర్మిస్తున్న ఫార్మా సిటీలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశముంది. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన మెడికల్‌ డివైజ్‌ మాన్యుఫాక్చరింగ్‌ పార్కులో 20 ఎకరాల్లో వైద్య పరికరాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.

వైద్య పరికరాలు, డయాలసిస్‌ మెషీన్లు, ఆస్పత్రి ఫర్నిచర్‌ తదితరాలను ఉత్పత్తి చేయనుంది. 20 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు మరో 50 ఎకరాల్లో వైద్య, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ కళాశాలలను ఏర్పాటు చేయనుంది. బీఆర్‌ఎస్‌ గ్రూప్‌ రానున్న ఐదేళ్లలో మొత్తంగా రూ.1,000 కోట్ల పెట్టుబడులతో వైద్యం, ఆతిథ్యం, ఔషధ తయారీ, ఆహారం, రిటైల్, ట్రేడిం గ్, అడ్వర్టైజింగ్, ఐటీ, ఫైనాన్షియల్‌ సర్వీ స్‌ సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పనుంది.

మరిన్ని వార్తలు