ప్రాణాలతో తిరిగి వెళ్తారనే నమ్మకం లేదు

25 Jun, 2017 03:13 IST|Sakshi
మూడేళ్లలో 370 మంది విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు మృతి: టఫ్‌
 
సాక్షి, హైదరాబాద్‌: ఉదయం ఇంటి నుంచి వెళ్లిన విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ప్రాణాలతో తిరిగి ఇళ్లకు చేరుతారనే నమ్మకం వారి కుటుంబ సభ్యులకు లేదని తెలంగాణ విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఫ్రంట్‌ (టఫ్‌) ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లలో సుమారు 370 మంది విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాత పడ్డారని పేర్కొంది. రెండేళ్ల పోరాటం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌ కార్మికులను విద్యుత్‌ సంస్థల్లో విలీనం చేసుకోవడానికి సిద్ధమైందని, అయితే కొందరు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని తెలిపింది.

విద్యుత్‌ కార్మికులకు మద్దతుగా టఫ్‌ అధ్యక్షుడు పద్మారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్‌.కిరణ్, ప్రధాన కార్యదర్శి సాయిబాబ, సాయిలు, శ్రీధర్‌ తదితరులు శనివా రం ఇక్కడ విలేకరులతో మాట్లాడా రు. 23 వేల మంది విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టర్ల చేతిలో దోపిడీకి గురవుతున్నారని తెలి పారు. జడ్చర్లలో ఓ కాంట్రాక్టర్‌ కార్మికులకు సంబంధించిన రూ.60 లక్షల పీఎఫ్‌ నిధులను స్వాహా చేశాడని, మూడేళ్లు గడుస్తున్నా అతడి నుంచి ఆ డబ్బు రికవరీ చేయలేదన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులంతా సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్, జేఎల్‌ఎం లాంటి తక్కువ కేడర్‌ ఉద్యోగులేనని, అంద రూ ఐటీఐ, పదో తరగతి విద్యార్హతలు ఉన్న వారేనని తెలిపారు. వీరి విలీనంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నష్టం జరగదని తెలిపారు.  
మరిన్ని వార్తలు