వానకు కూలిన గోడ: నలుగురికి తీవ్రగాయాలు

6 May, 2016 18:24 IST|Sakshi

హైదరాబాద్‌ : భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ పిట్టగోడ కుప్పకూలి పక్కన్నే ఉన్న రేకుల గదులపై పడింది. నిద్రిస్తున్న రెండు కుటుంబాలు క్షణాల్లో చెల్లాచెదురయ్యాయి. ఓ చిన్నారితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిద్ధిఖీనగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

వరంగల్ జిల్లాకు చెందిన రాజు ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తూ సిద్దిఖీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున గాలి వాన రావడంతో నిద్ర లేచి తలుపు తెరిచి నిలబడి ఉన్నాడు. రవీందర్ అనే వ్యక్తి వీరి ఇంటి పక్కనే భవనం నిర్మిస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న పిట్ట గోడ కుప్పకూలి రాజు గదిపై పడింది. నిద్రిస్తున్న భార్య సంగీత, కూతురు సంయుక్త(18 నెలలు)లపై శిథిలాలు పడ్డాయి, దీంతో చిన్నారి ఎడమ కాలు తొడ భాగంలో విరిగింది. తల్లి సంగీత తలకు తీవ్ర గాయమైంది. పక్క గదిలో ఉడుగుల యాదగిరి(36), భార్య లక్ష్మి నిద్రిస్తుండగా పిట్టగోడ శిథిలాలు గదిపై పడ్డాయి. లక్ష్మీ(30) నడుము భాగంలో ఫ్రాక్చర్ అయ్యింది. యాదగిరి ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అంజయ్యన గర్‌లోని కాకాతీయ ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న సర్కిల్-11 ఉప కమిషనర్, ఉప వైద్యాధికారి కె.ఎస్.రవి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవల ఖర్చులను జీహెచ్‌ఎంసీ భరిస్తుందని ఉప కమిషనర్ తెలిపారు. బాధితులను స్థానిక కార్పోరేటర్ షేక్ హమీద్ పటేల్ పరామర్శించారు.

ఘటనా స్థలం పరిశీలన
కూలిన పిట్టగోడను ఉప కమిషనర్ వి.వి.మనోహర్ పరిశీలించారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామనని స్పష్టం చేశారు. గాలి దుమారం, భారీ వర్షానికి కూలిన చెట్లు, వరద ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడతామని చెప్పారు.

మరిన్ని వార్తలు