ఎస్టీ విద్యార్థినులకు కొత్తగా 4 డిగ్రీ కాలేజీలు

2 Mar, 2016 00:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గిరిజన బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఎస్టీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ర్టంలో గిరిజన విద్యార్థినుల కోసం కొత్తగా నాలుగు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ రూపొందించిన ప్రతిపాదనలకు ఎస్టీ గురుకుల సంస్థల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదముద్ర వేసింది. వీటిని ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించింది. ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, పలువురు ఎమ్మెల్యేల వినతుల మేరకు గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఈ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రతిపాదించింది.

ఖమ్మం జిల్లాలో 7.65 లక్షల ఎస్టీల జనాభాకుగాను బాలికల కోసం 4 జూనియర్ కాలేజీలుండగా, మహిళల అక్షరాస్యత 43 శాతంగా ఉంది. వరంగల్ జిల్లాలో 5.3 లక్షల గిరిజనులుండగా, 4 జూనియర్ కాలేజీలున్నాయి. మహిళల అక్షరాస్యత 39 శాతంగా ఉంది. ఆదిలాబాద్‌లో 3 జూనియర్ కాలేజీలుండగా, అక్కడ దాదాపు 5 లక్షల గిరిజనులు నివసిస్తున్నారు. మహిళల అక్షరాస్యత 41 శాతంగా ఉంది. మహబూబ్‌నగర్  జిల్లాలో 3.6 లక్షల మంది గిరిజనులుండగా, 2 జూనియర్ కాలేజీలున్నాయి. మహిళల అక్షరాస్యత 30 శాతంగా ఉంది.

 జూనియర్ కాలేజీలుగా 4 గురుకుల పాఠశాలలు
 మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి, కల్వకుర్తి, వరంగల్ జిల్లా కొత్తగూడ, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలోని బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఎస్టీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనుంది. వీటిల్లో జూనియర్ కాలేజీ సెక్షన్లను ప్రారంభించాల్సిందిగా మంత్రి అజ్మీరా చందూలాల్ చేసిన విజ్ఞప్తి మేరకు 2015-16లో జూనియర్ కాలేజీ తరగతులను ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలో ఆ కాలేజీల ప్రారంభానికి అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎస్టీ శాఖ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు విజ్ఞప్తి చేయనున్నాయి.  
 
 160 మందికి సివిల్స్ లాంగ్‌టర్మ్ కోచింగ్
 ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి నుంచే సివిల్ సర్వీసెస్‌కు లాంగ్‌టర్మ్ కోచింగ్‌ను ఇవ్వాలని ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్ణయించింది. ప్రతి ఏడాది 160 మంది విద్యార్థులకు సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రత్యేక శిక్షణను ఇస్తారు. 9, 10, ఇంటర్ చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ ఈ శిక్షణను కొనసాగిస్తారు.

మరిన్ని వార్తలు